భారతదేశంలో భగవంతుడే జాతి జీవన సూత్రం: స్వామి చిదానందగిరి | YSS Sangam Celebrations Swami Chidananda Giri Participates | Sakshi
Sakshi News home page

భారతదేశంలో భగవంతుడే జాతి జీవన సూత్రం: స్వామి చిదానందగిరి

Feb 13 2023 7:39 AM | Updated on Feb 13 2023 4:55 PM

YSS Sangam Celebrations Swami Chidananda Giri Participates - Sakshi

హైదరాబాద్:  భారతదేశంలో భగవంతుడే జాతి జీవన సూత్రమని, ప్రపంచ నాగరికతకు ఈ  జీవన విధానమే  ఆధారమని యోగదా  సత్సంగ సొసైటీ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ అధ్యక్షులు స్వామి చిదానంద గిరి చెప్పారు. హైదరాబాద్ కన్హ ఆశ్రమంలో జరిగిన వైఎస్ఎస్ సంగం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మానవ జాతికి ఒక భద్రమైన, సమృద్ధమైన, ఆనందమయమైన భవిష్యత్తు కావాలంటే ఈ చైతన్యాన్ని  ప్రపంచ మానవులందరిలో నెలకొల్పా లని అయన సూచించారు. స్వర్ణమయమైన సనాతన భారతీయ ఆధ్యాత్మిక నాగరికతకు, భవిష్యత్తులో రాబోయే ఏక ప్రపంచ ఆధ్యాత్మిక నాగరికతకు మధ్య, వారధులుగా తయారవ్వాలని అయన భక్తులకు పిలుపునిచ్చారు . 

యోగదా  సత్సంగ సొసైటీ వ్యవస్థాపకులు పరమహంస యోగానంద ధ్యానం, సంఘం, గురుకృపతో కూడిన మూడు అంశాల సాధనా మార్గాన్ని ప్రసాదించారని స్వామి చిదానందగిరి చెప్పారు. ఈ మూడింటి సమ్మేళనమే ఈనాటి కార్యక్రమ ప్రధాన సూత్రమని తెలిపారు. దీన్ని  "క్రియాయోగ శరణం"గా అయన అభివర్ణించారు. తద్వారా దివ్యానందం, దివ్యకాంతి  అనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని ఆయన చెప్పారు.

నిత్యం క్రమం తప్పకుండా చేసే శాస్త్రీయ క్రియాయోగ సాధన ద్వారా  శాశ్వత పరమాత్మ తత్వంలో శరణు పొందాలన్నారు. పరమహంస యోగానంద చెప్పినట్లుగా ప్రపంచం ముక్కలవుతున్నా చెక్కుచెదరకుండా స్థిరంగా నిలబడాలంటే ఆత్మాలయంలో స్థిరంగా నిలబడాలని, తద్వారా  విజేతగా ఉండడానికి దృఢసంకల్పం చేసుకోవాలని స్వామి చిదానందగిరి సూచించారు. అయితే ముందుగా జ్ఞాన ఖడ్గంతో అవిద్యాజనిత సందేహాలన్నిటినీ  ఖండించి పారవేయాలన్నారు

కనుబొమ్మల మధ్య బిందువు మీద దృష్టిని ఏకాగ్రం చేస్తే, ఆంతరంగంలో నుంచి ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తుందని స్వామి చిదానంద గిరి చెప్పారు. ఈ అలౌకిక చైతన్యమే జీవితానికి గొప్ప రక్షణ అని ఆయన సందేశమిచ్చారు. 

ఈ కార్యక్రమానికి  సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఉపాధ్యక్షులు స్వామి విశ్వానందగిరి, యోగదా సత్సంగ సొసైటీ  ఉపాధ్యక్షులు స్వామి స్మరణానందగిరి,  ప్రధాన కార్యదర్శి స్వామి ఈశ్వరానందగిరి తదితరులు హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో 3200 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.  ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వేలాది మంది వీక్షించారు. ఈ నెల 16 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి.
చదవండి: యాదాద్రి తరహాలో ‘కొండగట్టు’ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement