తిరుమలలో ‘కూటమి’ తట్టలు!
పట్టించుకోని టీటీడీ అధికారులు
తిరుమల : శ్రీవారి సన్నిధిలో నయా దందాకు కూటమి నేతలు శ్రీకారం చుట్టారు. కొండపై అనధికారికంగా వ్యాపారాలు ప్రారంభించారు. అధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా దుకాణాలు పెట్టేశారు. అలిపిరి నుంచి తిరుమలలోని అఖిలాండం వరకు అనేక చోట్ల అనధికార హాకర్ల అవతారం ఎత్తేశారు. సాధరణంగా తిరుమలలో వ్యాపారం చేయాలంటే టీటీడీ నుంచి తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. ఈ మేరకు ప్రతినెలా టీటీడీకి ఫీజు చెల్లించాలి. అయితే కొందరు కూటమి నేతలు తిరుమలలో దందాలకు దిగేశారు. పుట్టగొడుగుల్లా అనధికార హాకర్‌లను పుట్టించేశారు.
ఈ క్రమంలో శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్న అఖిలాండం వద్ద నాలుగు, డీబీఆర్ రోడ్డులో షెడ్డుకు అనుకుని మరికొన్ని దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక వరాహాస్వామి అతిథిగృహం వద్ద మరికొందరు అనధికార హాకర్లు తట్టలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక అలిపిరి నుంచి గాలి గోపురం మధ్యలో జనసేన, టీడీపీ నేతలు రెండు దుకాణాలను అనధికారంగా పెట్టినట్లు సమాచారం. కూటమి నేతల పేర్లు చెప్పుకుని ఆయా దుకాణాలను ఏర్పాటు చేయడం గమనార్హం.
దీనిపై స్థానిక వ్యాపారులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. తమ దుకాణాలకు అద్దె చెల్లిస్తుంటే, కూటమి నేతలు మాత్రం అధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో షాపులు పెట్టుకుని పైసా కూడా టీటీడీకి కట్టడం లేదని ఆరోపిస్తున్నారు. కొండపై సుమారు 13 దుకాణాలకు పైగా కూటమి నేతల కనుసన్నల్లో వెలిసినట్లు వెల్లడిస్తున్నారు. ఇప్పటికై నా టీటీడీ అధికారులు స్పందించి అనధికార తట్టలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment