తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్‌ఓ శ్రీధర్‌తో కలిసి అదనపు ఈఓ భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం, వాహనసేవలు జరిగేలా చూడాలని టీటీడీ, పోలీసు ఉన్నతాధికారులను అదనపు ఈఓ కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, అలాంటివి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గరుడసేవ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాలరీలకు అన్నప్రసాదాలు చేరేలా చూడాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ తదితర అంశాల్లో టీటీడీ భద్రత, జిల్లా పోలీసులు పరస్పరం సమన్వయం చేసుకోవాలన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లు, కార్యక్రమాలను నిశితంగా పర్యవేక్షించడానికి ముఖ్యమైన అధికారులతో ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం, సీఈ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, రవాణా విభాగం జీఎం శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment