
అంకుర సంస్థలకు గ్రాంట్స్
తిరుపతి సిటీ: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పోషణ ఇంక్యుబేటర్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు మద్దతుగా అంకుర సంస్థలకు గ్రాంట్ పంపిణీ చేశారు. శుక్రవారం ఆర్‌ఏఆర్‌ఎస్ వేదికగా జరిగిన కార్యక్రమానికి వీసీ శారదా జయలక్ష్మి, పరిశోధన విభాగం డైరెక్టర్ సత్యనారాయణ వర్చువల్ విధానంలో పాల్గొని అర్హులకు గ్రాంట్ నిధులు పంపిణీ చేశారు. వారు మట్లాడుతూ వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పోషణ ఇంక్యుబేటర్ అగ్రగామిగా నిలుస్తోందన్నారు. అనంతరం అర్హులైన మొత్తం 20 స్టార్టప్‌లకు గ్రాంట్‌లను అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ వీ.సుమతి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కదిరిమోహన్, స్టార్టప్ ప్రతినిధులు పాల్గొన్నారు.