
స్విమ్స్‌కి జాతీయ హోదా ఇవ్వండి
● పార్లమెంటులో తిరుపతి ఎంపీ గురుమూర్తి డిమాండ్
తిరుపతి మంగళం: రాయలసీమ ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్న తిరుపతి స్విమ్స్ ఇన్‌స్టిట్యూట్‌ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా పరిగణించాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు మంజూరు చేస్తుందని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ఎంపీ లేవనెత్తారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్‌గా గుర్తింపు పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలు, గత దేళ్లలో ఇలా గుర్తింపు పొందిన ఆరోగ్య సంస్థల జాబితా వివరాలు తెలపాలని కోరారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి గుర్తింపు కోసం ప్రభుత్వానికి ఏవైనా ప్రతిపాదనలు అందాయా? అని ఎంపీ ప్రశ్నించారు. జాతీయ ప్రాముఖ్యత హోదా కలిగిన సంస్థగా ప్రకటించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్‌జాదవ్ పేర్కొన్నారు. తిరుపతి స్విమ్స్‌కు జాతీయ ప్రాముఖ్యత హోదా గుర్తింపు కోసం ప్రతిపాదనలు అందాయని, కానీ స్విమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా స్థాపించిన సంస్థ అని, ఈ హోదా కోసం పార్లమెంటులో చట్టం చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు.