
నేడు కలెక్టరేట్‌లో ‘గ్రీవెన్స్’
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. గత సోమవారం రంజాన్ సందర్భంగా గ్రీవెన్స్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో నేటి గ్రీవెన్స్‌కు పెద్దసంఖ్యలో అర్జీదారులు తరలివచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వసతులు అవసరం
వివిధ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులకు కనీస వసతులు కల్పించాల్సిన అవసరముంది. ఈ క్రమంలో మరుగుదొడ్లు శుభ్రం చేయించాలని పలువురు సూచిస్తున్నారు.అలాగే కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. అర్జీదారులతో అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా వృద్ధులు, దివ్యాంగులు ఏదైనా సమాచారం కోసం అడిగితే సిబ్బంది విసుక్కుంటున్నట్లు తెలుస్తోంది. అర్జీలు రాసుకోలేని వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అలాగే సమాచారం చెప్పేందుకు కొందరిని అందుబాటులో ఉంచాల్సిన అవసరముంది. జిల్లాస్థాయి గ్రీవెన్స్‌లో నిబంధనల ప్రకారం ఉన్నతాధికారులు పాల్గొనాలి. అయితే పలువురు అధికారులు తమ సబార్డినేట్లను పంపి చేతులు దులిపేసుకుంటున్నట్లు అర్జీదారులు ఆరోపిస్తున్నారు. గ్రీవెన్స్‌లో కలెక్టరేట్ ఉంటే ఒకలా...జాయింట్ కలెక్టర్ ఉంటే ఇంకోలా, డీఆర్‌ఓ ఉంటే మరోలా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో గ్రీవెన్స్ నిర్వహిస్తే 25 శాతానికి మించి అధికారులు హజరుకావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.