
నాటు తుపాకీ పేలి ఒకరి మృతి
వెంకటగిరి రూరల్: బాలాయపల్లి మండలం, కోటంబేడు గ్రామానికి చెందిన రమణయ్య నాటు తుపాకీ పేలి మృతి చెందినట్లు వెంకటగిరి సీఐ ఏవీ రమణ తెలిపారు. పట్టణంలోని పోలీసుస్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కోటంబేడు గ్రామానికి చెందిన వెంకటరమణయ్య గత నెల 30వ తేదీ నుంచి కనిపించడం లేదని అతని కుమారుడు శివప్రసాద్ స్థానిక పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేశారన్నారు. దర్యాప్తు నిర్వహించగా కోటంబేడు తెలుగుగంగ కాలువ బ్రాంచ్ కెనాల్ వద్ద మృతదేహం లభ్యమైనట్టు తెలిపారు. దర్యాప్తులో ఓజిలి మండలం, రావిపాడు గ్రామానికి చెందిన కొండా శివయ్యతో గత నెల 30వ తేదీ వెంకటరమణయ్య కలసి నాటు తుపాకీతో అడవి పందుల వేటకు ద్విచక్ర వాహనం పై వెళ్లినట్లు తేలిందన్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనం గుంతల్లో అదుపు తప్పి నాటు తుపాకి పేలి గుండు రమణయ్యకు తగిలి అక్కడికక్కడే మృతిచెందినట్టు వెల్లడించారు. దీంతో శివయ్య రమణయ్య మృతదేహాన్ని సమీప తెలుగుగంగ కాలువలో పడేసి అడవుల్లో తిరుగుతూ కాలం వెలదీశాడన్నారు. నీటీలో ఉన్న మృతదేహం పైకి తేలడంతో మృతదేహన్ని సమీప ముళ్ల పొదల్లో పడేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఈనెల 4వ తేదీన అటవీ ప్రాంతంలో రమణయ్య మృతదేహం గుర్తించి పోస్టుమార్టం నిర్వహించినట్లు వివరించారు. ఆపై శివయ్యను అరెస్టుచేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.