
25 మందిపై కేసు నమోదు
ఓజిలి: మండలంలోని అత్తివరం గ్రామంలో పరిశ్రమల విషయంలో చోటు చేసుకున్న వివాదంలో రెండు వర్గాలకు చెందిన 25 మందిపై గురువారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం మేరకు.. అత్తివరం గ్రామంలోని పారిశ్రామిక సెజ్‌లో పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమలలో అధిపత్యం కోసం టీడీపీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం పరిశ్రమలకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తుండగా పాల్చూరు అమరేంద్ర, ధర్మేంద్ర, పాకనాటి శ్రీనివాసులు మరో 10 మంది కలసి తనపై దాడి చేసి కులంపేరుతో దూషించారని బాధితుడు కుంపటి మహేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామంలో విచారణ జరిపి, 13 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. అలాగే పరిశ్రమలలో అధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చెలరేగిన వివాదంలో ఎల్లు గురుమూర్తి, మహేంద్ర, అనీల్‌రెడ్డితోపాటు మరో 9 మంది తనపై దాడి చేశారని పాకనాటి లోకేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాదితుడు ఫిర్యాదు మేరకు 12 మందిపై ఎస్‌ఐ స్వప్న కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును శుక్రవారం నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు విచారణ చేపట్టారు. అత్తివరం గ్రామంలోని పరిశ్రమలు, గ్రామస్తులను విచారణ జరిపి వివరాలు సేకరించారు. ఈ మేరకు రెండు వర్గాలు మధ్య వివాదాలు చోటుచేసుకోకుండా గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.