
ట్రాఫిక్ దిగ్బంధం.. ‘మెట్టు’ మార్గం!
చంద్రగిరి : వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం ఉదయం ఈ క్రమంలోనే శ్రీవారి మెట్టుకు వెళ్లే మార్గంలోకి పెద్దసంఖ్యలో భక్తులు వాహనాల్లో తరలిరావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లేందుకు దగ్గరి దారి కావడంతో ఇటీవల భారీగా భక్తులు ఇక్కడకు వస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం శ్రీవారి మెట్టు నుంచి సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలను క్రమబద్ధీకరించేవారు లేకపోవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వారాంతపు రోజుల్లో అయినా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు వెళ్లేవారి కోసం టీటీడీ కేవలం 3 వేల టోకెన్లను మాత్రమే జారీ చేస్తోంది.