
రేపటి నుంచి పీజీ పరీక్షలు
తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలోని పీజీ కళాశాలల్లో సైన్స్ గ్రూప్‌ల కోర్సులకు మంగళవారం నుంచి నాలుగో సెమిస్టర్ నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పరీక్షలకు ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే ఆర్ట్స్, కామర్స్ అండ్ కంప్యూటర్ పీజీ కోర్సుల పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు వివరించారు.
కేజీబీవీ విద్యార్థినికి సన్‌షైన్ అవార్డు
దొరవారిసత్రం : మండలంలోని కేజీబీవీలో సీనియర్ ఇంటర్ విద్యార్థిని నక్కబోయిన లహరి పీఎస్‌టీటీ (ఫెసిలిటేషన్ టీచర్ ట్రైనింగ్) గ్రూపులో 969 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి సన్‌షైన్ స్టార్స్ అవార్డుకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ పార్వతి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన మంత్రి చేతుల మీదు అవార్డు అందుకోనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా బీన్‌ఎన్ కండ్రిగ మండలం పార్లపల్లెకు చెందిన నక్కబోయిన ఆనందయ్య, బుజ్జమ్మ దంపతుల కుమార్తె లహరి సన్‌షైన్ అవార్డుకు ఎంపిక కావడంపై ప్రిన్సిపల్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు
తిరుపతి అర్బన్ : ఐసీడీఎస్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత ప్రాజెక్టు డైరెక్టర్ వసంత బాయి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ ఒన్ స్టాప్ సెంటర్ స్కీమ్ ద్వారా పారామెడికల్ సిబ్బంది, మల్టీపర్పస్ స్టాఫ్, కుక్, సెక్యూరిటీ గార్డు, నైట్ గార్డు తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. రూ.13వేల నుంచి రూ.19వేల వరకు వేతనాలు ఉంటాయన్నారు. అలాగే మిషన్ వాత్సల్య స్కీమ్‌లో ఒప్పంద ప్రాతిపదికన ట్రీ ఆపరేటర్, సోషల్ వర్కర్, డేటా అన్‌లిస్ట్ తదితర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. ఎంపికై న వారికి వేతనం రూ.7944 నుంటి రూ.18,536 వరకు ఉంటుందని చెప్పారు. ఆసక్తిగలవారు దరఖాస్తును ఈ నెల 15 నుంచి 30వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వివరించారు. 18ఏళ్ల నుంచి 42ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కలెక్టరేట్‌లోని బి–బ్లాక్ ఐదో అంతస్తులోని ఐసీడీఎస్ జిల్లా కార్యాలయంలోని 506 గదిలో దరఖాస్తులు అందించవచ్చని, లేదా పోస్టు ద్వారా పంపవచ్చని తెలిపారు. ఓసీ అభ్యర్థులు రూ.250, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ. 200 డీడీ కట్టాల్సి ఉంటుందని వివరించారు. వివరాలకు తిరుపతి.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

రేపటి నుంచి పీజీ పరీక్షలు