
నేర నియంత్రణకు డ్రోన్ కెమెరాలు
– పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రారంభించిన ఎస్పీ
తిరుపతి క్రైమ్ : మ్యాట్రెస్ థర్మల్ డ్రోన్ కెమెరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వాటి పనితీరును పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణకు డ్రోన్ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. బహిరంగ ప్రదేశాలు, అగ్నిప్రమాద స్థలాలు, అటవీ ప్రాంతాల పరిశీలనకు వాడుకోవచ్చని చెప్పారు. ఇందుకోసం మొత్తం నాలుగు డ్రోన్లను తీసుకువచ్చామన్నారు. ఇందులోని ఒక డ్రోన్‌లో అడ్వాన్స్‌డ్ కెమెరా ఉందని వెల్లడించారు. సుమారు ఒక కిలోమీటర్ ఎత్తు వరకు ఎగిరి పరిసరాల దృశ్యాలను పూర్తిస్థాయిలో అందిస్తాయని తెలిపారు. రాత్రి వేళల్లో కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా పూర్తిస్థాయిలో ఉపయోగపడతాయన్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు జనాలను కాపాడేందుకు వినియోగించుకోవచ్చని వెల్లడించారు. వీటిని వాడేందుకు 40 మంది పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చామన్నారు. ఇందులో 20 మంది సివిల్ కానిస్టేబుళ్లు 20 మంది ఏఆర్ సిబ్బంది ఉన్నారని వివరించారు.
ప్రగతి వివరాలు
జిల్లాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది విధులను పెంచి నేరాలను కట్టడి చేసినట్లు జిఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. మార్చి నుంచి ఇప్పటివరకు సాధించిన ప్రగతి పురోగతిని తెలిపారు. ఆయన మాటల్లోనే..
● గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశాం. సుమారు 119.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. 11 కేసులు నమోదు చేశాం.
● బహిరంగంగా మద్యం సేవించే 3,145 ప్రదేశాలను గుర్తించాం. వాటిని శుభ్రం చేయించాం. ఈ క్రమంలోనే 32 మంది మందుబాబులకు జరిమానా విధించాం.
● జిల్లావ్యాప్తంగా పోలీసులు ఆధ్వర్యంలో 223 పల్లె నిద్ర కార్యక్రమాలు చేపట్టాం.
● రాంగ్ రూట్లో వచ్చే వాహనాలపై కఠినమైన చర్యలు తీసుకున్నాం. 359 కేసులు నమోదు చేశాం. ఇప్పటివరకు రూ.12.40 లక్షల జరిమానా వసూలు చేశాం.