రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రేణిగుంట కడప రైల్వే మార్గంలోని రైల్వే కోడూరు సమీపంలో ఉప్పరపల్లి రైల్వే గేటు వద్ద ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. అతనికి సుమారు 25 ఏళ్లు ఉంటాయని, మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని రైల్వే పోలీసులు తెలిపారు. ఎవరైనా అతని ఆచూకీ గుర్తిస్తే రేణిగుంట పోలీసులను సంప్రదించాలని సూచించారు. 9885753379, 9963126343 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
కిడ్నాప్ కేసులో కొత్త కోణం!
– ఇద్దరు నిందితులకు ముగిసిన కస్టడీ
తిరుపతి క్రైమ్ : నగరంలో పది రోజులకు ముందు జరిగిన కిడ్నాప్ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. రాజేష్ కుటుంబీకులను కిడ్నాప్ చేసిన ఆరుగురు నిందితులను అలిపిరి పోలీసులు నాలుగు రోజులు ముందు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం కోర్టు అనుమతితో వీరిని రెండు రోజులపాటు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వాస్తవాలను నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ప్రధాన ముద్దాయిలైన అరుణ్ కుమార్, భార్గవ్ తమ పేర్ల పైన కొత్త కంపెనీలు ప్రారంభించారన్నారు. ఇలా కొత్త కంపెనీలు ప్రారంభించి ట్రేడింగ్ చేస్తామని జనాలను నమ్మించినట్లు వెల్లడించారు. చాలమందికి వారి అకౌంట్లోనే పర్సనల్ లోన్లు ఇప్పించారి, ఆ లోన్ డబ్బులను తమ వద్ద ఇన్‌వెస్ట్ చేస్తే అధిక డబ్బులు వస్తాయని చెప్పారన్నారు.
అనంతరం ఆ డబ్బులు ఉపయోగించుకొని జనాలను మోసం చేశారని చెప్పారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎంతమంది మోసపోయారు అన్నది ఇంకా పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులకు కస్టడీ ముగియడంతో ఆదివారం వీరిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచినట్లు వెల్లడించారు. మరోసారి కస్టడీకి తీసుకుని పూర్తి విషయాలను రాబడతామన్నారు. అంతేకాకుండా కిడ్నాప్ అయిన వారికి మత్తు ఇంజెక్షన్లు వేసేందుకు కూడా మీరు సిద్ధమైనట్లు వివరించారు. నిందితుల నుంచి ఆపరేషన్ థియేటర్లో ఉపయోగించే అనస్తీషియా మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.