
కాల్షియం కార్బైడ్ వాడితే కఠిన చర్యలు
తిరుపతి అర్బన్: మామిడి కాయలు మాగబెట్టడానికి కాల్షియం కార్బైడ్‌ను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఆయన మంగళవారం మామిడి జిల్లాస్థాయి అధికారుల కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడి కాయలు సహజ సిద్ధంగా మాగడానికి వరిగడ్డిని వాడడంతోపాటు పేపర్ బాగ్స్, నాచురల్‌గా సహజ హార్మోన్ ఎతిలీన్ గ్యాస్ స్ప్రే చేయడం, రిపెనింగ్ ఛాంబర్‌లో ఎతిలీన్ హార్మోన్ ఉపయోగించి మగ్గబెట్టడం శీతల గిడ్డంగుల్లో కూడా ఎతిలీన్ హార్మోన్ ఉపయోగించి మామిడి పండ్లు మగ్గబెట్టవచ్చని చెప్పారు. మానవులకు ప్రమాదం లేకుండా ఉండే వాటిని మాత్రమే మగ్గబెట్టడానికి వినియోగించాలని ఆదేశించారు. అంతేతప్ప ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ వినియోగిస్తే వారికై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. పదేపదే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అధికారులు శాంపిళ్లు తీసి, పరిశీలించాని స్పష్టం చేశారు. కమిటీలోని ఏడు విభాగాలైన ఫుడ్ సేప్టీ, మార్కెటింగ్, మున్సిపల్, మెడికల్, పంచాయతీ, ఉద్యానశాఖ, ట్రాన్స్‌పోర్ట్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథరామిరెడ్డి, డీపీఓ సుశీలాదేవి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వర్‌రావు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి మద్దిలేటి, ఫుడ్ సేఫ్టీ అధికారులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.