
శ్రీసిటీలో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ క్యాబిన్
శ్రీసిటీ (వరదయ్యపాళెం): శ్రీసిటీలోని బీఎఫ్‌జీ ఇండియా పరిశ్రమ వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల క్యాబినన్లను తయారు చేస్తూ సత్తా చాటుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో 16–కోచ్‌ల రైలు కోసం ఇంటీరియర్స్, మాడ్యులర్ టాయ్‌లెట్ క్యాబిన్‌లు, ఏరోడైనమిక్ ఫ్రంట్ ఎండ్‌ల రూపకల్పన, తయారీ, ఇన్‌స్టాల్ చేయడం లాంటివి చేపడుతోంది. రైలులో 823 బెర్త్‌లు, 51 టాయ్‌లెట్లు ఉంటాయని బి.ఎఫ్.జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కె.ప్రేమమూర్తి తెలిపారు.
మెట్రో ప్రాజెక్టుల్లో కీలకం
భారతదేశ మెట్రో రైలు ప్రాజెక్టుల అభివృద్ధిలో బీ.ఎఫ్.జీ కీలక పాత్ర పోషించిందని శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. భారతీయ ప్రతిష్టాత్మక రైల్వే, సముద్ర రవాణాతో సహా బహుళ రంగాలలో శ్రీమేడ్ ఎట్ శ్రీసిటీశ్రీ ఉత్పత్తులను ఉపయోగించడం గర్వంగా ఉందన్నారు. ఫెర్రీ–ఆధారిత పట్టణ రవాణా అయిన కొచ్చి వాటర్ మెట్రోకు కూడా బీ.ఎఫ్.జీ భాగస్వామ్యాన్ని అందించినట్టు ఆయన పేర్కొన్నారు.
రేణిగుంటలో మహారాష్ట్ర అధికారుల పర్యటన
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రాష్ట్రంలో రైతుల భూముల రీసర్వే విధానంపై అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ చొక్కా లింగం సేతులింగం మంగళవారం రేణిగుంట మండలంలో పర్యటించారు. మండలంలోని, గుత్తివారిపల్లి సచివాలయంలో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా సర్వే అసిస్టెంట్ డైరెక్టర్, రేణిగుంట మండల తహసీల్దార్ సురేష్ బాబు వివిధ కేటగిరీల సర్వే అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ముందుగా సర్పంచ్ మంజుల, స్థానిక నాయకులు మునస్వామి నాయుడు, అధికారులకు సాదరంగా స్వాగతం పలికారు. రైతులు పలు భూ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని, భూముల రీ సర్వేలో చిన్న చిన్న లోపాలను కూడా పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. సమావేశంలో రెవెన్యూ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
అనర్హత వేటుకు సిఫార్సు చేయండి
చిల్లకూరు: ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ గుర్తుపై గెలిచి, ఆ పార్టీ ఇచ్చిన విప్‌ను ధిక్కరించి, మరో పార్టీకి మద్దతు ఇస్తున్న కౌన్సిలర్లపై అనర్హత వేటు వేసేందుకు సిఫార్సు చేయాలని వెంకటగిరి మున్సిపల్ విప్ పూజారి లక్ష్మి మంగళవారం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏఓ శిరీషాను కలిసి విప్‌ను ధిక్కరించిన ముగ్గురు కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వెంకటగిరి మున్సిపాలిటీలో 25 మంది కౌన్సిలర్లు వైఎస్సార్ సీపీ బీఫామ్‌పై గెలిచారన్నారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాల్లో ముగ్గురు కౌన్సిలర్లు పార్టీ విప్‌ను ధిక్కరించి అధికార టీడీపీకి మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. విప్‌ను ధిక్కరించిన క్రమంలో పట్ణణంలోని 3,5,7 వార్డులకు చెందిన కౌన్సిలర్లు పీ పద్మావతి, నారి శేఖర్, కే చంద్రశేఖర్‌రెడ్డిపై ప్రభుత్వ పరంగా అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. వెంకటగిరి మున్సిపాలిటీ వైఎస్సార్ సీపీకి పెట్టని కోటలా ఉందని, ప్రస్తుతం వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అండతో పటిష్టంగా ఉండి, భవిష్యత్తులో పట్టణాభివృద్ధికి సహకారం అందించే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఆమె వెంట వైఎస్సార్ సీపీ నాయకులు శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు.

శ్రీసిటీలో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ క్యాబిన్

శ్రీసిటీలో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ క్యాబిన్