
టీటీడీపై రాజకీయం తగదు
తిరుపతి కల్చరల్ : ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది విశ్వసించే టీటీడీపై రాజకీయం తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్‌లో ఆయన మాట్లాడారు. ఎస్వీ గోశాలను రాజకీయ వేదికగా మార్చవద్దని కోరారు. ఈ క్రమంలోనే న్యాయవ్యవస్థను ధ్వంసం చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్కర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను గవర్నర్లుగా నియమించి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు గవర్నర్ తీరుని సుప్రీం కోర్టు సైతం తప్పు పట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్‌తో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుండా వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా విద్యార్థుల ఉన్నత భవిష్యత్‌ను కాపాడేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ నేతలు రామానాయుడు, శివారెడ్డి, మురళి, చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, విశ్వనాథ్ పాల్గొన్నారు.