
నేడు ఈ–వేస్ట్ సెంటర్ల ఏర్పాటు
తిరుపతి అర్బన్: జిల్లాలోని పంచాయతీల పరిధిలో ఈ–వేస్ట్ (ఎలక్ట్రానికి వ్యర్థాలు)సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి శుక్రవారం తెలిపారు. శనివారం నుంచి ఇవేస్ట్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. అయితే మండల కేంద్రాలుగా ఉన్న పంచాయతీలు, 10 వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీల్లో ఏర్పాటు చేయనున్నట్టు ఆమె స్పష్టం చేశారు.
ఏపీపీఎస్‌సీ పరీక్షల్లో తిరుపతి రచయితపై ప్రశ్న
తిరుపతి కల్చరల్: ఏపీపీఎస్‌సీ ఈనెల 4వ తేదీ నిర్వహించిన పరీక్షల్లో తిరుపతి జిల్లాకు చెందిన రచయిత ఆర్‌సీ.కృష్ణస్వామి రాజుపై ఒక ప్రశ్న రావడం విశేషం. పేపర్ –1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ప్రశ్నపత్రంలో 31వ ప్రశ్నలో ఆయన రచించిన ‘జక్కదొన’ పుస్తక రచయిత ఎవరు? అని బహుళైచ్చిక ప్రశ్నగా అడిగారు. ఈ పుస్తకంలోని జక్కదొన కథ పాత చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలం, జక్కదొన గ్రామం ప్రధానాంశంగా సాగుతోంది. ఆ ఊరు పులికంటి కృష్ణారెడ్డి సొంత ఊరు కావడం గమనార్హం. ఆయనకు ఈ పుస్తకాన్ని రచయిత రాజు అంకితమిచ్చారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ పుస్తకాన్ని ఎస్వీయూ సెనేట్ మందిరంలో ఆవిష్కరించారు. మొత్తం 21 కథల సంకలనమైన ఈ పుస్తకంలో అన్ని వర్గాలకు చెందిన వారిని పరిచయం చేశారు రచయిత.
నేడు తిరుమలలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర
తిరుమల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తిరుమలలో సామూహిక శ్రమదానాన్ని టీటీడీ నిర్వహించనుంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. అలిపిరి నడక దారిలోని కుంకాల పాయింట్ (ఆఖరి మెట్టు) వద్ద నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
కళ్యాణ కట్టలో టీటీడీ చైర్మన్ తనిఖీలు
తిరుమల : తిరుమల శ్రీవారికి భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్ట, నందకం మినీ కళ్యాణ కట్టలో శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. భక్తుల తలనీలాల సమర్పణను క్షేత్రస్థాయిలో పరిశీలించి క్షురకుల ప్రవర్తనపై అభిప్రాయాలను భక్తుల నుంచి తెలుసుకున్నారు. ఒక ప్రాంతంలోని కళ్యాణకట్టలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రద్దీ తక్కువగా ఉండే కళ్యాణకట్టకు భక్తులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, నరేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
16వ ఆర్థిక సంఘం
బృందానికి సాదర వీడ్కోలు
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకొని శుక్రవారం ఉదయం ఢిల్లీకి తిరుగు పయనమైన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డా.అరవింద్ పనగారియా, సభ్యులు అన్నే జార్జ్ మ్యాథ్యూ, డా.మనోజ్ పాండా, రిత్విక్ పాండే, కేకే మిశ్రా, అమృత, ఆదిత్య పంత్ తదితర సభ్యులతో కూడిన బృందానికి రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ (ఫైనాన్స్) పీయూష్ కుమార్, జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్, కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి , సంబంధిత అధికారులు 16వ ఆర్థిక సంఘం బృందానికి సాదర వీడ్కోలు పలికారు.

నేడు ఈ–వేస్ట్ సెంటర్ల ఏర్పాటు