
గోవులంటే చులకనెందుకో?
ఎప్పుడు ఏం జరిగిందంటే..
సాక్ష్మి, టాస్క్‌ఫోర్స్: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోమాతల మృతిపట్ల కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు గోవుల మృతిని సీరియస్‌గా తీసుకోకపోగా.. మరణాలను బయటపెట్టిన వారిపై కేసులు పెట్టించడాన్ని హిందువులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇంతజరుగుతున్నా హిందూ సంఘాలు ఏమయ్యాయని జనం ప్రశ్నిస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పిన విషయాలు నిజమా? కాదా? అనే విషయాన్ని నిగ్గుతేల్చేందుకు యత్నించాల్సిన బీజేపీ నేతలు తలోమాట మాట్లాడడంపై మండిపడుతున్నారు. బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామి గోవుల మృతిపై తీవ్రంగా స్పందించడంతో పాటు.. ఈ విషయంపై త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేయడంతో కూటమి నేతలు ఆత్మరక్షణలో పడ్డారు.
ఎందుకు స్పందించడంలేదో?
టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయని వైఎస్సార్‌సీపీ అధికారప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు కూటమి నేతలు, టీటీడీ చైర్మన్, ఈఓ తలోమాట.. తలోరకంగా ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ నేతలు టీటీడీ గోవుల మృతి ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకోకపోవడంపై పలువురు మండిపడుతున్నారు. హిందూ సంఘాలు అని చెప్పుకునే వారు సైతం గోవుల మృతి ఘటనపై స్పందించకపోవడంపై విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతినెలా అన్ని గోవులు మృతి చెందుతాయా?
టీటీడీ గోశాలలో 1,800 గోవులు ఉన్నట్లు సమాచారం. వృద్ధాప్యం కారణంగా ప్రతి నెలా గోవులు మృతి చెందుతున్నాయని కూటమి నేతలు, టీటీడీ ఈఓ ప్రకటించారు. వృద్ధాప్యం కారణంగా ప్రతినెలా 15 గోవులు మరణించడం ఏమిటని ‘గో’ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఈ లెక్కన పదేళ్లలో గోశాలలోని గోవులన్నీ మరణించి ఉండాలి కదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పశువైద్యుల అంచనా ప్రకారం వాటి సహజ మరణాల రేటు 3 శాతం మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కన వెయ్యి పశువులు ఉంటే.. అందులో వృద్ధాప్యం వల్ల ఏడాదికి 30 మాత్రమే మరణిస్తాయని వివరించారు. ఆ లెక్కన గోశాలలో మరణించే పశువుల సంఖ్య ఏడాదికి 60కి మించే ప్రసక్తిలేదంటున్నారు. మూడు నెలల కాలంలో 43 గోవులు మృతి చెందినట్లు ఈఓ ప్రకటించడం ఆందోళన కలిగించే విషయమని చెబుతున్నారు.
అదే రోజు అర్ధరాత్రి నుంచి పోలీసులను రంగంలోకి దింపి వైఎస్సార్‌సీపీ శ్రేణులందరినీ హౌస్ అరెస్ట్ చేసి గోశాలకు రాకుండా నిర్బంధించారు. ఆపై తమ ఎల్లో మీడియా ద్వారా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై విషప్రచారం చేయడం ప్రారంభించారు.
గోవుల మృతిని సీరియస్‌గా తీసుకోని బీజేపీ
గోవులు మృతి చెందాయన్న వారిపై ఎదురుదాడి
సుబ్రమణ్యంస్వామి హెచ్చరికలతో ఆత్మరక్షణలో కూటమి నేతలు
గోవుల మృతిపై హిందూ సంఘాలు ఎందుకు స్పందించడం లేదో?
టీటీడీ గోశాలలో వందకుపైగా గోవులు మృతి చెందాయి.
(ఈనెల 11న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపణ)
గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం
(ఈనెల 11న టీటీడీ విడుదల చేసిన ప్రకటన)
తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయని అపద్దాలు చెబుతున్నారు.
(ఈనెల 14న గుంటూరు జిల్లా పొన్నేకల్లులో సీఎం చంద్రబాబునాయుడు ఉద్ఘాటన)
ప్రతి నెలా సగటున 15 గోవులు మరణిస్తుంటాయి. మూడు నెలల్లో 43 గోవులు మృతి చెందాయి. అన్నీ సహజ మరణాలే.
(టీటీడీ ఈఓ శ్యామలరావు ఈనెల 14న మీడియా సమావేశంలో వెల్లడి)
టీటీడీ గోశాలలో 20 నుంచి 22 గోవులు మృతి చెంది ఉండొచ్చు. వృద్ధాప్యం కారణంగానే మృతి చెందాయి.
(టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈనెల 13న ఎస్వీ గోశాల మీడియా సమావేశంలో..)
ఎస్వీ గోశాలలో 40 గోవులే మృతి చెందాయి. అయితే అవన్నీ అనారోగ్యంతోనే మృతి చెందాయి.
(తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈనెల 12న మీడియా సమావేశంలో..)
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి గోశాలకు వచ్చి గోవులు మృతిచెందాయని నిరూపించాలి
(ఈనెల 16న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ట్వీట్)
మీ సవాల్‌ని స్వీకరిస్తున్నా. 17న ఉదయం 10 గంటలకు టీటీడీ గోశాలకు కచ్చితంగా వస్తున్నా. మీరూ రండి.
(టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఈనెల 16న రీ ట్వీట్)
సరిచేసుకోవడం మాని..!
టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందుతున్నాయని భూమన చెప్పిన విషయంలో నిజమో? కాదో? విచారించాలి. నిజమే అయితే వెంటనే గోవులు మృతి చెందకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అది మానేసి.. నిజాలు చెప్పిన వారిపై ఎదురుదాడి చేయడం, తలో ప్రకటన చేసి టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. సవాల్ విసిరి.. వస్తామన్న వారిని పోలీసుల చేత అడ్డుకోవడం.. ఆ తరువాత వైఎస్సార్‌సీపీ వాళ్లే రాలేదని అసత్య ప్రచారం చేయడంపై కూటమి నేతలే అసహ్యించుకుంటున్నారు. గోవుల మృతి విషయంలో తమ పార్టీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడి అభాసుపాలయ్యారని కూటమి శ్రేణులు చర్చించుకుంటున్నారు.

గోవులంటే చులకనెందుకో?