
రంగులేస్తే ఏమొస్తుంది.. అభివృద్ధి చేయండి సారూ!
● తుడా బెంచీలకు పసుపు రంగులొద్దని అడ్డగింపు ● అభివృద్ధి పనులు చేయాలన్న ఉప్పరపల్లి వాసులు ● అదే బెంచీలకు బులుగు రంగు కొట్టి జై భీమ్ అని రాసుకున్న గ్రామస్తులు ● తోక ముడిచిన టీడీపీ అల్లరిమూకలు ● 10 మందిపై అక్రమ కేసులకు యత్నం
పాకాల: ‘సారూ.. బెంచీలకు ఇష్టమొచ్చిన రంగులద్దితే ఏమొస్తుంది.. గ్రామంలో సవాలక్ష సమస్యలున్నాయి. ముందు వాటికి పరిష్కారం చూపండి’ అంటూ మండలంలోని ఉప్పరపల్లి వాసులు అధికారులకు ఎదురుతిరిగారు. రెండు రోజుల క్రితం గ్రామ కార్యదర్శి తుడా నిధులో వేసిన బెంచీలకు పసుపు రంగులు కొట్టేందుకు గ్రామానికి వెళ్లారు. రంగులద్దేటందుకు ప్రయత్నించగా.. గ్రామస్తులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. గ్రామంలో దారి సమస్య ఉందని, మురికి కాలవులు శుభ్రం చేయలేదని, పారిశుద్ధ్య అధ్వాన్నంగా ఉందని సదరు పంచాయతీ కార్యదర్శికి సమస్యలు ఏకరువు పెట్టారు. అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. దీంతో చేసేది లేక అక్కడి నుంచి పంచాయతీ కార్యదర్శి మొహం చాటేశారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఎలాగైన ఆ గ్రామంలో బెంచీలకు పసుపు రంగులు వేయాలని ప్రణాళిక రచించారు. దీన్ని పసిగట్టిన గ్రామస్తులు తామే సొంతంగా బులుగు రంగు తెచ్చుకుని బెంచీలకు అద్ది.. జై భీమ్ అని రాసి తమ విజ్ఞతను చాటుకున్నారు.
అక్రమ కేసులకు యత్నం
బెంచీలను తాకే ధైర్యం లేక అధికార మదంతో కొందరు టీడీపీ అల్లరిమూకలు రెచ్చిపోయాయి. పోలీసులను అడ్డుపెట్టుకుని చెలరేగిపోయాయి. గ్రామానికి చెందిన పది మంది యువకుల పేర్లు రాసుకుని ‘మీపై అక్రమ కేసులు బనాయిస్తాం’ అని బెదిరించినట్లు సమాచారం. అసలు ఈ విషయంలో పోలీసులు ఎందుకు అత్యుత్సాహం చూపుతున్నారో అర్థం కాని పరిస్థితి. స్థానిక గ్రామానికి చెందిన యువతను పోలీస్టేషన్‌కి పిలిపించి విచారించినట్లు సమాచారం.