
ఏసీబీ వలలో శ్రీకాళహస్తి సర్వేయర్
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తికి చెందిన సర్వేయర్ పురుషోత్తంరెడ్డి లంచం తీసుకుంటూ సోమవారం ఎసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ విమల తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్‌రెడ్డి అనే సీనియర్ సిటిజన్ శ్రీకాళహస్తి పట్టణంలోని ఊరందూరుకు వెళ్లే మార్గంలో ఉన్న విశాలాక్షి నగర్‌లో 2000 సంవత్సరంలో 75 సెంట్లు భూమిని కొన్నాడు. అయితే అక్కడ కళాశాల నిర్మించాలనే తలంపుతో దానిని క్రమబద్ధీకరించేందుకు ఫిబ్రవరి 20వ తేదీన తహసీల్దారు కార్యాలయంలో సంప్రదించాడు. దీనిపై చలానా చెల్లించి తహసీల్దారుకు వినతిపత్రం అందించాడు. 21 రోజుల తర్వాత ఆయన వినతిని తిరస్కరించినట్టు తెలిసింది. మళ్లీ రెండో సారి దానిపై దరఖాస్తు చేశాడు. అయినా కాకపోవడంతో తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి దీనిపై తహసీల్దారు, సర్వేయర్‌ను ప్రశ్నించగా రూ.30 వేలు చెల్లిస్తే మీ పని అవుతుందని తెలిపారు. అంత ఇచ్చుకోలేనని రూ.15 వేలు ఇస్తానని ప్రాధేయపడ్డాడు. కుదరదని రూ.25 వేలు ఇస్తేనే మీ పని అవుతుందని గట్టిగా చెప్పారు. గత్యంతరం లేక రూ.25 వేలు చెల్లించడానికి ఒప్పుకుని వెళ్లిపోయాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేక చంద్రశేఖర్‌రెడ్డి ఏసీబీని సంప్రదించాడు. సోమవారం ఉదయం ఏసీబీ అధికారులు చంద్రశేఖర్‌రెడ్డికి రూ.25వేలు నగదు ఇచ్చి కార్యాలయంలోకి పంపారు. డీఎస్పీ విమల తన బృందంతో శ్రీకాళహస్తి తహసీల్దారు కార్యాలయం బయటే వేచి ఉన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి లోపలకు వెళ్లి సర్వేయర్ పురుషోత్తంరెడ్డికి రూ.25వేలు లంచం అందజేశాడు. అనంతరం ఏసీబీ అధికారులు పురుషోత్తంరెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని తహసీల్దారు కార్యాలయంలో సోదాలు చేపట్టారు. సెలవులో ఉన్న తహసీల్దారు లక్ష్మీనారాయణను పిలిపించి విచారణ చేపట్టామని డీఎస్పీ తెలిపారు. అయితే ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో డీఎస్పీ జెస్సీ, ప్రశాంతి, సీఐ నరసింహ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఏసీబీ వలలో శ్రీకాళహస్తి సర్వేయర్