
5 నుంచి ఉద్యమ కార్యాచరణ
శ్రీకాళహస్తి : విద్యారంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న గందరగోళ పరిస్థితులకు నిరసనగా మే 5వ తేదీ నుంచి ఉద్యమ కార్యాచరణ అమలు చేయనున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మురళీకృష్ణ, బి.బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన ఏపీటీఎఫ్ సమావేశంలో వారు మాట్లాడుతూ సర్కారు విధానాలతో పాఠశాల విద్యకు నష్టం కలుగుతోందని ఆరోపించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలను నెలకొల్పితే, కూటమి సర్కారు తొమ్మిది రకాల బడులను ఏర్పాటు చేసేందుక యత్నిస్తోందని వెల్లడించారు. . ఒక్కో పాఠశాలకు ఒక్కొక్క రకం విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని ప్రకటించడం అన్యాయమని మండిపడ్డారు. ప్రాథమిక పాఠశాలలకు పూర్వ ప్రాథమిక విద్యను అనుసంధానం చేయాలని కోరారు. ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7 తరగతులు ఉన్న చోట నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6, 7, 8. తరగతులు ఉన్న చోట 6 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కొనసాగించాలని సూచించారు. ప్రతి తరగతికి ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీపీఎస్, జీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ వారికి వెంటనే ఓపీఎస్ అమలు చేయాలన్నారు. 12వ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. పెండింగ్ డీఏలను తక్షణం ప్రకటించాలన్నారు. తమ పూర్తిస్థాయి డిమాండ్లను పరిష్కరించకుంటే 5న మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, 9న జిల్లా కేంద్రంలో ధర్నాలు. 14న విజయవాడలో రాష్ట్రస్థాయి ధర్నా చేపట్టనున్నట్లు హెచ్చరించారు . సమావేశంలో ఏపీటీఎఫ్ నేతలు వెంకటాద్రి, గోపాల్, సురేష్ బాబు చంద్రశేఖర్, హరి గజేంద్ర, దిలీప్ పాల్గొన్నారు.