
● జర్నలిస్టులపై కూటమి నేతల దాడులు ● సాక్షి విలేకరులే టా
తిరుపతి అర్బన్ : కూటమి సర్కార్ మీడియాను అణగదొక్కేందుకు యత్నిస్తోందని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. పత్రిక కార్యాలయాలు, జర్నలిస్టులపై భౌతిక దాడులు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. శ్రీకాళహస్తి అర్బన్ సాక్షి రిపోర్టర్ ఎన్.శ్రీనివాసులుపై సోమవారం రాత్రి జరిగిన దాడికి నిరసనగా తిరుపతి జర్నలిస్టులు నిరసన తెలిపారు. మంగళవారం తిరుపతి న్యూబాలాజీ కాలనీలోని అడిషనల్ ఎస్పీ కార్యాలయానికి పెద్దసంఖ్యలో జర్నలిస్టులు తరలివచ్చారు. అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారికి ఫిర్యాదు చేశారు. టీడీపీ, జనసేన నేతల మధ్య పట్టణంలో ప్లెక్సీల ఏర్పాటు సందర్భంగా వివాదం ఏర్పడిందని, ఆ గొడవను సాక్షి రిపోర్టర్ శ్రీనివాసులు ఫొటో తీస్తుండగా దాడి చేశారని వివరించారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వెళుతుంటే మరోసారి దాడులు చేశారన్నారు. నిందితులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అరాచక రాజకీయం
రేణిగుంట: శ్రీకాళహస్తిలో ఇలాంటి అరాచక రాజకీయాలను ఎప్పుడూ చూడలేదని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాక్షి విలేకరి నెల్లూరు శ్రీనివాసులును ఆయన మంగళవారం పరామర్శించారు. శ్రీనివాసులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాక్షి విలేకర్లపై పచ్చమూక అమానుషంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, చివరకు పోలీస్‌స్టేషన్ ఎదుటే మరోమారు టీడీపీ నేతలు దాడి చేశారని విమర్శించారు. నెల్లూరు శ్రీనివాసులను హతమార్చేందుకే మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. బాధితులపైనే పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటుందని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎల్లోమీడియాలో తనపై అనేక అసత్య ఆరోపణలతో కట్టు కధలు ప్రచురించినా పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికై నా కలెక్టర్, ఎస్పీ స్పందించి శ్రీకాళహస్తిలో శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరారు. ముక్కంటి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు పగడాల రాజు, యువత అధ్యక్షుడు శ్రీవారి సురేష్, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫరీద్, నేతలు ఉత్తరాజి శరవణ కుమార్, కంఠా ఉదయ్ కుమార్, మున్నా రాయల్, శివ కుమార్ పాల్గొన్నారు.