
షేక్ మస్తాన్ తో కుటుంబసభ్యులు
అనంతగిరి: సుమారు 17 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ వ్యక్తి అనూహ్యంగా తల్లిదండ్రుల చెంతకు చేరడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇది కలనా.. నిజమా అని వారు సంభ్రామాశ్చర్యంలో మునిగి తేలారు. ఒక కేసు వీరిని ఒకే వేదికపై తీసుకొచ్చింది. ఈ సంఘటన తాండూరు మహిళా పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన షేక్ పీర్‌సాబ్– జైబున్సిసా దంపతులకు ఏడుగురు సంతానం, వీరిలో నలుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు.
రెండో కుమారుడు షేక్‌మస్తాన్ 17 సంవత్సరాల క్రితం తన మేనమామ అబ్దుల్ రహీం వెంట హైదరాబాద్ వెళ్లాడు. అప్పటి నుంచి ఇద్దరి ఆచూకీ దొరకలేదు. కుటుంబ సభ్యులు కొన్నాళ్లు వెతికినా ఫలితం లేకుండా పోవడంతో చేసేదేమి లేక ఆశలు వదులుకున్నారు. కాగా మొదటి భార్యతో విడిపోయిన షేక్ మస్తాన్ తాండూరుకు చెందిన తబస్సుం బేగంను రెండో పెళ్లి చేసుకున్నాడు. భర్త తరచూ వేధిస్తున్నాడని తబస్సుమ్ తల్లిగారింటికి వచ్చింది. వికారాబాద్ మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్‌లోని మౌలాలిలో నివాసం ఉంటున్న మస్తాన్‌ను పోలీసులు కౌన్సెలింగ్‌కు పిలిచారు.
పోలీస్‌స్టేషన్ దగ్గర తన చిన్ననాటి మిత్రుడు శివ అతన్ని గుర్తించాడు. విషయాన్ని మరో మిత్రుడు ఇమ్రాన్‌కు సమాచారం అందించాడు. హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో హోటల్ నడుపుతున్న షేక్ మస్తాన్ కుటుంబ సభ్యులకు అతను సమాచారం అందించాడు. దీంతో కుటుంబ సభ్యులు వికారాబాద్ సీఐ ప్రమీలను సంప్రదించారు. ఈ నెల 5న కౌన్సెలింగ్ ఉందని, మీరు రావాల్సిందిగా కోరడంతో వారు శుక్రవారం వచ్చారు. మస్తాన్‌ను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. భార్యతో సఖ్యతతో ఉండాలని కుమారుడికి తల్లిదండ్రులు హితవు పలికి ఇద్దరిని కలిపారు.