కోట్‌పల్లి ప్రాజెక్టు నీటిలో పర్యాటకులు
ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద పర్యాటకులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరచి.. అక్కడికి ఎవ్వరూ రాకుండా నిషేధం విధించడం విమర్శలకు తావిస్తోంది. జనవరి 16న పూడూర్ మండలం మన్నెగూడకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు యువకులు ఈత కోసం ప్రాజెక్టుకు వచ్చి నీట మునిగి చనిపోయారు. దీన్ని సాకుగా చూపి పోలీసు, ఫారెస్టు, రెవెన్యూ శాఖల అధికారులు ప్రాజెక్టు వద్దకు పర్యాటకులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే వారికి సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఆ విషయాన్ని విస్మరించి ఇలా నిషేధం విధించడం ఏమిటని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో కోట్‌పల్లికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.
ఇక్కడ నీటిలో సరదాగా ఆడుకొని సేద తీరుతారు. యువతీ యువకులు గంటల తరబడి నీటిలో సరదాగా ఈత కొడతారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకే తలమానికమైన ఈ ప్రాజెక్టును పర్యాటక రంగానికి దూరం చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నించారు. ప్రాజెక్టు వద్ద కాయ కింగ్ బోటింగ్ సైతం నిషేధించారు. 6 నెలల గడిచినా బోటింగ్ సంస్థకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు హైకోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికై నా ప్రభుత్వం చొరవ తీసుకొని కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టడంతోపాటు పర్యాటకులు, బోటింగ్‌కు అనుమతి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment