పెద్దేముల్ మండలంలో అనుమతి లేకుండా తవ్వకాలు జరిపిన ప్రాంతం
వికారాబాద్: చిన్న తరహా ఖనిజాల పరిధిలోకి వచ్చే సుద్ద, ఇనుప ఖనిజాల అక్రమ తవ్వకాలు, రవాణా జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్నాయి. పగటి వేళ గనుల్లో జేసీబీ, ఇటాచీలను వినియోగించి ముడి సుద్దను, ఎర్రమట్టిని వెలికి తీస్తున్నారు. టిప్పర్లు, లారీల్లో నింపి సమీప వ్యవసాయ పొలాల్లో భారీగా నిల్వ చేస్తున్నారు. పరిశ్రమల నుంచి ఆర్డర్లు రాగానే రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా లారీల్లో పరిమితికి మించి 40టన్నుల నుంచి 50టన్నుల ఖనిజ సంపదను తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి టన్నుకు రూ. 206 చొప్పున రాయల్టీ చెల్లించాలి. అది కూడా లీజు పొందిన గనులకు మాత్రమే. అయితే వెలికితీసిన సుద్దకు చాలా మంది యజమానులు రాయల్టీ చెల్లించకుండా పరిశ్రమలకు తరలిస్తున్నారు. దీంతో గనుల శాఖకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో తొమ్మిది రకాల ఖనిజ సంపదకు సంబంధించిన గనులు ఉండగా ఇందులో 226 చిన్న తరహా, నాలుగు పెద్ద తరహా ఖనిజాలకు సంబంధించినవి ఉన్నాయి. అయితే ఇందులో పెద్దల హస్తం ఉండటంతో ఇటీవల మైనింగ్ ఏడీని సైతం మార్చారు. ఇప్పటి వరకు జిల్లాలో విధులు నిర్వహించిన ఏడీని మార్చి గతంలో ఏసీబీకి చిక్కి అనేక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని జిల్లాకు తీసుకురావటం పలు విమర్శలు తావిస్తోంది.
సుద్ద గనులు
కోట్‌పల్లి, పెద్దేములు, మోమిన్‌పేట్, ధారూరు, మారేపల్లి, ఇందోల్, ఒగులాపూర్, రుద్రారం, గోపాల్‌పూర్, తింసాన్‌పల్లి, టేకులపల్లి, జైద్‌పల్లి, మర్పల్లి, కోట్‌మర్పల్లి, వికారాబాద్, తరిగోపుల, రాకంచర్ల, సిద్దులూరు, మాదిరెడ్డిపల్లి, ఎక్‌మామిడి తదిదర ప్రాంతాలతో పాటు తాండూరు, బషీరాబాద్, కొడంగల్, దోమ, పూడూరు, వికారాబాద్ మండలాలలో సుద్ద నిల్వలు ఉన్నాయి. పది నుంచి 20 టన్నుల సామర్థ్యం ఉన్న లారీల్లో 40 నుంచి మొదలుకొని 50 టన్నుల వరకు సుద్దను, ఇతర ఖనిజాన్ని తరలిస్తున్నారు. ప్రతి రోజూ డిమాండ్‌ను బట్టి వందల లారీల్లో ఖనిజాన్ని తరలిస్తూ అక్రమార్జనకు తెరతీస్తున్నారు. అధికారులు సైతం వారికే కొమ్ముకాస్తున్నారు. కట్టడి చేయాల్సిన మైనింగ్ శాఖ అధికారులు అమ్యామ్యాలకు ఆశపడి చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా సుమారు రూ.100 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.
లీజు ఒకచోట.. రాయల్టీ మరోచోట
లీజు ఒక చోట ఉంటే రాయల్టీ మరో చోట తీసుకొని సుద్ద, ఎర్రమట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లీజు తీసుకున్న సర్వే నంబర్ భూమిలోనే తవ్వకాలు చేయాల్సి ఉంది. కానీ కొంత మంది వ్యాపారస్తులు లీజు లేని చోట తవ్వకాలను చేస్తూ సుద్దను అక్రమ రవాణా చేస్తున్నారు. ఎకరం భూమిని లీజుకు తీసుకొని రెండు ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు తవ్వకాలు చేస్తున్నారు. ఈ విషయమై మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా భావించిన కొంత మంది మైనింగ్ వ్యాపారులు అక్రమ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. గతంలో పెద్దేముల్ మండలం మారేపల్లిలో లీజ్ లేకుండా సుద్ద తవ్వకాలు జరిపిన వారిపై నామమాత్రపు ఫైన్లు వేసి వదిలేశారు. కనీసం గ్రామాల అభివృద్ధి కోసం వచ్చే సెస్ సైతం రావడం లేదు. దీంతో పల్లెల అభివృద్ధి కుంటుపడుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఫారెస్ట్ భూముల్లోనూ..
వికారాబాద్, తాండూరు సమీపంలోని ఫారెస్టు భూముల్లో కొందరు మైనింగ్ తవ్వకాలు జరిపి రూ. వందల కోట్ల విలువగల ఖనిజ సంపద తరలిస్తున్నారు. దీన్ని గుర్తించిన ఫారెస్టు అధికారులు గతేడాది అడ్డుకున్నారు. వికారాబాద్ సమీపంలోని ఫారెస్టులో రెండు చోట్ల ఇద్దరు బడా మైనింగ్ వ్యాపారులు చాలా కాలంగా తవ్వకాలు జరిపి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. ఒక్కో కాంట్రాక్టర్ రూ. 60 కోట్ల చొప్పున ఖనిజ సంపద కొల్లగొట్టారని లెక్కగట్టి రెండు గనులను మూసి వేయించారు. అందులో ఒకరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాండూరు సమీపంలోని ఆత్కూర్ సమీపంలోని ఫారెస్టు భూమిలో తవ్విన క్వారీలో అక్రమంగా రూ. 160 కోట్ల విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టారని కోర్టులో కౌంటర్ ఫైల్ దాఖలు చేశారు. కొద్ది రోజుల్లోనే ఆ అధికారిని బదిలీ చేయించి తిరిగి తమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తూ రూ. కోట్లు కొల్లగొడుతున్నారు.
అనుమతి లేకుండా సుద్ద, ఇనుప ఖనిజం రవాణా
అటవీ భూములనూ వదలని వైనం
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
గ్రామాల ప్రగతికి అవరోధం
Comments
Please login to add a commentAdd a comment