
పంచాయతీ కార్మికుడి మృతి
వాటర్ ట్యాంక్‌లో పడి
తాండూరు రూరల్: ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంక్‌లో పడి ఓ పంచాయతీ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కరన్‌కోట్ గ్రామంలో చోటు చేసుకుంది. కరన్‌కోట్ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మ్యాతరి లక్ష్మప్ప(42) ఏడేళ్ల నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మల్టీపర్పస్ వర్కర్‌గా పని చేస్తున్నారు. అప్పుడప్పడు ఆయన వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసేవాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి.. రాత్రయినా తిరిగి రాలేదు. దీంతో ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. ఆదివారం ఉదయం గ్రామంలోని పంచాయతీకి చెందిన బంగారమ్మ తాగునీటి ట్యాంక్‌పైన లక్ష్మప్ప బట్టలు కనిపించాయి. వెంటనే వెళ్లి చూడగా వాటర్ ట్యాంక్‌లో విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అప్పటికే లక్ష్మప్ప మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి మృతి చెందాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ఓ కూతురు ఉంది.
శుభ్రం చేయించాం
కరన్‌కోట్ గ్రామంలోని బంగారమ్మ గుడి వద్ద ఉన్న తాగునీటి వాటర్ ట్యాంక్ 60 వేల నీటి సామర్థ్యం కలదని గ్రామస్తులు తెలిపారు. అయితే ఈ ట్యాంక్ నుంచి జయశంకర్ కాలనీతో పాటు సీసీఐ కాలనీకి నీటి సరఫరా అవుతుంది. శనివారం రాత్రి పంచాయతీ కార్మికుడు ట్యాంకులో పడి మృతి చెందాడు. మృతదేహం నిల్వ ఉన్న నీరు ఆదివారం ఉదయం సరఫరా కావడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి ఆనంద్‌రావును వివరణ కోరగా.. ట్యాంక్‌ను శుభ్రం చేయించామన్నారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.
ఆ నీటిని తాగామని గ్రామస్తుల భయాందోళన
కరన్‌కోట్‌లో ఘటన
Comments
Please login to add a commentAdd a comment