‘స్థానిక’ ఎన్నికల్లో రిజర్వేషన్‌ కల్పించండి | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికల్లో రిజర్వేషన్‌ కల్పించండి

Published Tue, Feb 18 2025 7:34 AM | Last Updated on Tue, Feb 18 2025 7:34 AM

‘స్థానిక’ ఎన్నికల్లో రిజర్వేషన్‌ కల్పించండి

‘స్థానిక’ ఎన్నికల్లో రిజర్వేషన్‌ కల్పించండి

భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్‌

పరిగి: స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించాలని భారత భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టణ కేంద్రంలో వికలాంగుల సాధారణ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్‌ కల్పించకుంటే పరిగి నుంచే ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో దివ్యాంగులకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. దివ్యాంగుల పెన్షన్‌ రూ.6వేలకు పెంచడంతో పాటు ఆర్టీసీలో వందశాతం ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు. దివ్యాంగులకు అట్రాసిటీ అమలు చేస్తామన్న కాంగ్రెస్‌ ఇప్పటి వరకు అమలు చేయడం లేదని విమర్శించారు. దివ్యాంగులను విస్మరించిన ఏ ప్రభుత్వం నిలబడినట్టు చరిత్రలో లేదన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ లక్ష్మయ్య, ఆయా మండలాల అధ్యక్షులు చంద్రయ్య, చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

చోరీ కేసులో వ్యక్తి అరెస్ట్‌, రిమాండ్‌

కడ్తాల్‌: పార్కింగ్‌ చేసిన ఆటోను అపహరించిన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు. సీఐ శివ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూర్‌ మండలం నేదునూర్‌ గ్రామానికి చెందిన సదానందంగౌడ్‌, రామచంద్రయ్య ఇరువురు ఆటోలో ఈ నెల 9న మండల కేంద్రంలోని అగస్త్య ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చారు. ఆస్పత్రి ఎదుట ఆటోను పార్కింగ్‌ చేసి, వైద్యం చేయించుకుని వచ్చేసరికి ఆటో కనిపించలేదు. వెంటనే డ్రైవర్‌ సదానందంగౌడ్‌.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. క్రైమ్‌ టీం సిబ్బంది రాజశేఖర్‌, రాంకోటీలు సోమవారం మండల కేంద్రంలోని తలకొండపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం కోమటికుంటకు చెందిన నాగశేషు అనుమానస్పదంగా వ్యవహరించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం ఒప్పుకున్నాడు. అనంతరం అతన్ని అరెస్టు చేసి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నాగశేషును రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరు పరిచి, జైలుకు తరలించారు.

పార్టీల మధ్య ఫ్లెక్సీల వివాదం!

బడంగ్‌పేట్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పందంగా మారింది. ఇదెలా జరిగిందంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఫ్లెక్సీల విషయంలో అధికార పార్టీ నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు సైతం కాంగ్రెస్‌ వారికే మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ శ్రేణులు.. రోడ్లకు ఇరువైపులా కటౌట్లు, బ్యానర్లు, ఫెక్సీలు ఏర్పాటు చేయగా.. ఆదివారం రాత్రికిరాత్రే వాటిని మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు. దీంతో గులాబీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. సోమవారం కమిషనర్‌ సరస్వతికి ఫిర్యాదు చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. బ్యానర్లు తొలగించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పార్టీల కతీతంగా విధులు నిర్వహించాలని కమిషనర్‌కు సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement