
ప్రణాళికతో ప్రగతి
● లాభాల బాటలో నావంద్గీ సొసైటీ
● రూ.1.20 కోట్ల వార్షిక ఆదాయం
● వాణిజ్యపరమైన సేవలతో ఆర్థిక తోడ్పాటు
బషీరాబాద్: పాలకవర్గం ప్రణాళికబద్ధంగా చేస్తున్న వ్యవసాయ సేవలతో పాటు వాణిజ్యపరమైన నిర్ణయాలతో మండల కేంద్రంలోని నావంద్గీ సొసైటీ పటిష్ట స్థితికి చేరుకుంది. 2023–2024 ఆర్థిక సంవత్సరానికి గాను కమర్షియల్ బిజినెస్‌తో రూ.1.20 కోట్లు ఆర్జించింది. ఈ నిధులతో సొసైటీకి ఆర్థిక వనరులు చేకూర్చే నిర్మాణాలను చేపట్టి ఆదర్శంగా నిలుస్తుంది. ఇందులో 4,400 మంది రైతుల సభ్యత్వంతో రూ.కోటి షేరింగ్ నిధులతో పాటు రూ.3.50 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను సొంతం చేసుకుంది. అన్నదాతలకు సకాలంలో పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఇచ్చి అండగా ఉంటుంది. అలాగే వ్యవసాయ సేవల్లో భాగంగా రైతులకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారు. పండించిన ధాన్యం కొనుగోళ్లు చేస్తూ రైతులకు సహకారం అందిస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. వ్యవసాయ ఆధారిత సేవలతో పాటు వాణిజ్యపరమైన వ్యాపారాలపై కూడా దృష్టి పెట్టింది. బంగారంపై తక్కువ వడ్డీకి రుణాలు, ఇంటి, వాహనాలపై రుణాలు ఇస్తుంది. దీంతో ఏడాదిలో రూ.1.20కోట్ల లాభాలను ఆర్జించి పటిష్టమైన ఆర్థిక సొసైటీగా నిలిచింది.
పెట్రోల్ బంక్, రైస్‌మిల్ నిర్మాణాలు
సొసైటీ సొంత నిధులతో పాటు రూ.2 కోట్ల నాబార్డు రుణాలు తీసుకొని పెట్రోల్ బంక్, రైస్ మిల్ నిర్మాణాలు చేపట్టింది. ఇప్పటికే రైస్‌మిల్ పూర్తికాగా, పెట్రోల్ బంక్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అలాగే 1500 మెట్రిక్ టన్నులు, వెయ్యి మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసే రెండు భారీ గోదాంల నిర్మాణ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. వాణిజ్యపరమైన పెట్రోల్ బంక్, రైస్‌మిల్ సేవలు అందుబాటులోకి వస్తే వార్షిక ఆదాయం నాలుగు రెట్లు పెరుగుతుందని పాలకవర్గం అంచనా వేస్తుంది. అలాగే ధాన్యం నిల్వల సామర్థ్యం 2500 మెట్రిక్ టన్నులకు చేరనుంది.
నావంద్గీ సొసైటీ కార్యాలయం
సమష్టి కృషితో లాభాలు
రైతులు, పాలకవర్గం సభ్యుల సహకారంతో పాటు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తోడ్పాటుతో సొసైటీని లాభాల బాట పట్టించామని సొసైటీ చైర్మన్ వెంకట్‌రామ్‌రెడ్డి అన్నారు. రైతులకు వ్యవసాయ ఆధారిత సేవలందిస్తూనే వాణిజ్యంపై దృష్టి పెట్టామన్నారు. సొసైటీకి సొంతంగా ఆర్థిక వనరులు అందించే పెట్రోల్ బంక్, రైస్‌మిల్ వంటి నిర్మాణాలు చేపట్టామన్నారు. త్వరలోనే వాటి సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment