ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేయాలి
● మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య
కొత్తూరు: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్(పాలిథిన్) ఉత్పత్తుల నిషేధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య కోరారు. ఇందులో భాగంగా మంగళవారం పాత మున్సిపల్ కార్యాలయంలో తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంతో జరిగే అనర్థాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతకు వ్యాపారులు, ప్రజలు పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇళ్లు, ఖాళీ ప్రాంతాల్లో చెత్తను పారబోయకుండా ప్రజలు శుభ్రతను పాటించాలన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం చిన్న చిన్న ఫంక్షన్ల(శుభకార్యాలు)తో పాటు పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం చాలావరకు పెరిగిందన్నారు. నాణ్యతలేని ప్లాస్టిక్ ఉత్పత్తుల కారణంగా పర్యావరణంతో పాటు మానవ ఆరోగ్యాలకు చాలావరకు ముప్పు ఉందన్నారు. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. దీనికితోడు తడి, పొడిచెత్తను వేరుచేసి సిబ్బందికి అందించాలని ప్రజలు, వ్యాపారులను కోరారు. నాణ్యతలేని ప్లాస్టిక్ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారులకు జరిమానాలు విధిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ బాలాజీ, కౌన్సిలర్ సోమ్లానాయక్, నాయకులు సుదర్శన్‌గౌడ్, దేవేందర్‌ముదిరాజ్, మహిళా సంఘాల సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment