
‘నక్ష’.. శాశ్వత రక్ష
ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలకు భద్రత
ప్రతీ స్థలానికి యూనిక్ నంబర్
అణువణువూ డిజిటల్ రూపంలో నిక్షిప్తం
పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్ మున్సిపాలిటీ
కొడంగల్: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 152 మున్సిపాలిటీల్లో పైలెట్ ప్రాజెక్టుగా నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ (నక్ష) కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకు రాష్ట్రంలోని పది మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. అందులో వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కావడంతో తొలిదశలో కొడంగల్‌ను ఎంపిక చేశారు. మంగళవారం కొడంగల్‌లో నక్ష పైలెట్ ప్రాజెక్టు సర్వేను జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ సుధీర్, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రాంరెడ్డి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ సభ్యుడు సుధీర్ గోలి, సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసర్ సమీరుద్దీన్, డిప్యూటీ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఉమా మహేశ్వర్‌రావు, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి తదితరులు పాల్గొని సర్వేను అధికారికంగా ప్రారంభించారు.
మూడు పద్ధతుల్లో ఏరియల్ సర్వే
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఇళ్లు భవనాలు ఇతర నిర్మాణాల పూర్తి వివరాలను జియో స్పేషియల్ సాంకేతితతో సేకరిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలోని ప్రతీ స్థలంలోని అణువణువు డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేయనున్నట్లు చెప్పారు. ఇండ్లు భవనాల విస్తీర్ణం, ఎత్తు, సర్వే నంబర్, యజమాని పేరు, ఇతర వివరాలతో ప్రాపర్టీ కార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. పక్కాగా రెవెన్యూ రికార్డులు, ఆస్తి పన్ను నిర్ణయం, వసూళ్లలో పారదర్శకత ఉంటుందన్నారు. ఇళ్లు, స్థలాల వివాదాలకు పరిష్కారం చూపనున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో అభివృద్ధి ప్రణాళికలకు ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. హెలికాఫ్టర్ ఏరియల్ సర్వే సిబ్బంది మాట్లాడుతూ.. మూడు పద్ధతుల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లు, చిన్న పాటి విమానాలకు ప్రత్యేక కెమెరాలను అమర్చి సర్వే చేయడానికి అనుమతి ఉందన్నారు. కొడంగల్‌లో హెలికాఫ్టర్ ద్వారా సర్వే చేయనున్నట్లు చెప్పారు. గాలిలో ఎగురుతూ హెలీకాఫ్టర్ ద్వారా ఫొటోలు తీస్తామని వివరించారు. ప్రతి ఫొటోకు ఐడెంటిటీ నంబర్ ఉంటుందని.. ఈ సర్వేలో భూమిపైన ఉన్న నిర్మాణాలకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్ ద్వారా అందుతాయని చెప్పారు. సర్వే నంబర్, ఇంటి నంబర్, విస్తీర్ణం, యజమాని పేరు తదితర వివరాలతో ఫొటోలు వస్తాయన్నారు. ఈ సమాచారం మేరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంబంధిత స్థలాల వద్దకు వెళ్లి విచారణ జరిపిస్తారని, తదనంతరం యజమానికి ప్రాపర్టీ కార్డు వస్తుందన్నారు. రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించేందుకు ఇళ్ల స్థలాల వివాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేకు ఆదేశించిందని వివరించారు. అనంతరం సర్వే సిబ్బంది మున్సిపల్ పరిధిలో సర్వే చేయడానికి హెలికాఫ్టర్‌లో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

‘నక్ష’.. శాశ్వత రక్ష
Comments
Please login to add a commentAdd a comment