పోదాం పోలేపల్లి
నేటి నుంచి రేణుకాఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు
సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం
రేపు సీఎం రేవంత్‌రెడ్డి రాక
బొంరాస్‌పేట: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు వైభవంగా జరగనున్న జాతరకు ఆలయం ముస్తాబైంది. అమ్మవారి గుడితోపాటు పరశురాముడి గుడి, కోనేరు, ప్రాంగణమంతా రంగులతో కనువిందు చేస్తున్నాయి. జాతరలో ప్రధాన ఘట్టమైన సిడెను వీక్షించేందుకు రాష్ట్రంతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకోనున్నారు. అందుకు తగినట్లు అధికార యంత్రాంగం ఏర్పాట్లను సిద్ధం చేసింది. కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఈసారి ప్రత్యేకం
ఏటా కనుల పండువగా జరిగే పోలేపల్లి ఎల్లమ్మ ఉత్సవాల్లో ఆలయ కమిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. రూ.10 లక్షలతో సిడెను, రూ.14 లక్షలతో కొత్త తేరును(రథం) సిద్ధం చేశారు. గురువారం రాత్రి గ్రామవీధుల్లో పల్లకీ సేవ, శుక్రవారం సాయంత్రం జల్దిబోనం, సిడె కార్యక్రమం నిర్వహిస్తారు. రథానికి ఒక పొడవాటి దుంగను కడతారు. దాని చివరన ఒక తొట్టెను ఏర్పాటు చేసి, అందులో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఉంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఈ సమయంలో పసుపు బండారు భక్తులపైకి విసురుతూ అమ్మవారికి జేజేలు పలుకుతారు. శనివారం సాయంత్రం తేరు, రథోత్సవం, ఆదివారం ప్రత్యేక పూజలు, 24న గ్రామంలో పల్లకీ ఊరేగింపు ఉంటుంది.
హాజరుకానున్న ప్రముఖులు
పోలేపల్లి గ్రామంలో స్వయంభుగా వెలసిన ఎల్లమ్మ మాత జాతరలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి 21న రానున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిడెను తిలకించనున్నారు. సీఎం మధ్యాహ్నం తర్వాత దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ జయరాములు తెలిపారు. ఇందుకోసం అధికారులు హెలిపాడ్ సిద్ధం చేశారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ డీకే అరుణ, ఎనుముల తిరుపతిరెడ్డి, జిల్లా కలెక్టర్‌తోపాటు ప్రముఖులు దర్శించుకోనున్నారు. భక్తులకు ఆరోగ్యం, భద్రత కోసం వైద్య సిబ్బందితో శిబిరాలు, పోలీసు బందోబస్తుతో ప్రత్యేక నిఘాను ఉంచారు. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
ఏర్పాట్లు సిద్ధం
రాష్ట్రంలో అతిపెద్ద జాతరైన మేడారం మాదిరిగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. సీఎం ప్రత్యేక శ్రద్ధతో ఈసారి జాతరను వైభవంగా నిర్వహిస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాం. మొబైల్ మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానాల గదులు, తాగునీరు వంటివి ఏర్పాటు చేశాం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దానికి తగ్గట్లు అధికారులతో సమన్వయం చేసుకుంటాం.
– జయరాములు, ఆలయ కమిటీ చైర్మన్, పోలేపల్లి దేవస్థానం
పోదాం పోలేపల్లి
పోదాం పోలేపల్లి
పోదాం పోలేపల్లి
Comments
Please login to add a commentAdd a comment