పోలీసుల్లో అతడే బాస్!
రెండు దశాబ్దాల్లో నలుగురే
వికారాబాద్: ఆధునిక భారత నిర్మాణానికి మహిళా శక్తి కొండంత అండ. వారు అనేక రంగాల్లో తమ ప్రతిభ చూపుతూ దేశాభివృద్ధిలో కీలకంగా మారారు. ఇంత చేస్తున్నా కొన్ని రంగాల్లో జెండర్ పరమైన చిన్నచూపును ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని పోలీసు శాఖలో మహిళా ఎస్‌ఐల విషయంలో వివక్ష కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వీరికి ఎస్‌హెచ్‌ఓలుగా బాధ్యతలు అప్పగించడానికి ఉన్నతాధికారులు ఆసక్తి చూపటం లేదు. విధి నిర్వహణలో అన్ని రకాల బాధ్యతలు అప్పగిస్తున్నా ఎస్‌హెచ్‌ఓ(స్టేషన్ హౌస్ ఆఫీసర్)లుగా మాత్రం చాన్స్ ఇవ్వడం లేదు. జిల్లాలో ప్రస్తుతం ఆరుగురు మహిళా ఎస్‌ఐలు ఆయా ఠాణాలు, హెడ్ క్వార్టర్‌లో విధులు నిర్వహిన్నారు. వీరిలో ఒక్కరిని కూడా ఎస్‌హెచ్‌ఓగా నియమించకపోవడం పోలీసు శాఖలో కొనసాగుతున్న వివక్షకు రుజువుగా నిలుస్తోంది. ఈ ఆరుగురు లా అండ్ ఆర్డర్‌లో అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారు. కేసుల విచారణ మొదలుకుని బందోబస్తులు, నైట్ డ్యూటీలు, పరేడ్ తదితర అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారిని ఎస్‌హెచ్‌ఓలుగా మాత్రం తీసుకోవడం లేదు.
పైరవీల సంస్కృతితో అడ్డు
జిల్లాలో మొత్తం 22 పోలీస్ స్టేషన్లు ఉండగా ఇందులో మూడు చోట్ల(వికారాబాద్, వికారాబాద్ మహిళా, తాండూరు) ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారులు ఎస్‌హెచ్‌ఓలుగా కొనసాగుతున్నారు. మిగిలిన 19 పోలీస్ స్టేషన్లలో సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ) ర్యాంకు అధికారులు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒక్కరు కూడా మహిళలు లేకపోవడం గమనార్హం. అన్ని ఠాణాల్లో పురుషాధిక్యమే రాజ్యమేలుతోంది. ప్రతి పోస్టింగ్ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫార్సులతో జరుగుతుందనేది బహిరంగ రహస్యమే. అయితే డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహించే పురుషుల పైరవీల నేపథ్యంలో మహిళా పోలీసులు వెనుకబడుతున్నారు. దశాబ్దాల తరబడి ఉద్యోగకాలం మొత్తం ఎస్‌హెచ్‌ఓలుగా విధులు నిర్వహించకుండానే అదనపు ఎస్‌ఐలుగా, లూప్‌లైన్ డ్యూటీల్లో విధులు నిర్వహించాల్సి వస్తోందని మహిళా ఎస్‌ఐలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త జిల్లా ఏర్పాటు కాకముందు నుంచే పశ్చిమ రంగారెడ్డి జిల్లా పరిధిలోని 20 ఠాణాలతో వికారాబాద్‌లో ఎస్సీ కార్యాలయం కొనసాగుతోంది. అయితే గడిచిన రెండు దశాబ్దాల్లో జిల్లాలో నలుగురికి మాత్రమే ఎస్‌హెచ్‌ఓలుగా బాధ్యతలు అప్పగించారు. ఇందులో లక్ష్మీమాధవి నవాబుపేట, వికారాబాద్ ఎస్‌హెచ్‌ఓగా పురుషులకు దీటుగా బాధ్యతలు నిర్వర్తించి శభాష్ అనిపించుకున్నారు. అనంతరం హర్షభార్గవి ధారూరు ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు నిర్వహించారు. వీరిద్దరు మాత్రమే జనరల్ పోలీస్ స్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓలుగా బాధ్యతలు నిర్వహించగా, మరో ఇద్దరు ప్రమీలా, రేణుకారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్ బాధ్యతలు చేపట్టారు. మొత్తంగా గడిచిన ఇరవై ఏళ్లలో నలుగురు మాత్రమే స్టేషన్ బాధ్యతలు చక్కబెట్టారు. ప్రస్తుత ఎస్పీ నారాయణరెడ్డి తమకు ఎస్‌హెచ్‌ఓలుగా అవకాశం కల్పిస్తారని మహిళా ఎస్‌ఐలు ఆకాంక్షిస్తున్నారు.
ఎస్‌హెచ్‌ఓలుగా అవకాశం దక్కని మహిళా ఎస్‌ఐలు
జిల్లాలో ఆరుగురు ఉన్నా అన్ని చోట్లా అదనపు ఎస్‌ఐలుగానే
సకల బాధ్యతలు నిర్వహిస్తున్నా చిన్నచూపు తగదంటూ ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment