తప్పని తాగునీటి కష్టాలు!
తాండూరు రూరల్: వేసవికాలం రాకముందే పల్లెల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. పెద్దేముల్ మండలం ఆత్కూర్ గ్రామంలో గ్రామస్తులు తాగునీటికి తండ్లాడుతున్నారు. వారం రోజులుగా మిషన్ భగిరథ నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. సంగమేశ్వర ఆలయం వద్ద బోరు మోటారు నుంచి గ్రామానికి తాగునీటి పైప్‌లైన్ ఉంది. ఈ పైప్‌లైన్ తరచూ లీకేజీలకు గురువుతుంది. తాగునీటి నీటి సమస్యను పట్టించుకునే వారు కరువయ్యారు. ఈ క్రమంలో మళ్లీ కొన్ని రోజుల నుంచి పైప్‌లైన్ లీకేజీతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. అటు మిషన్ భగిరథ నుంచి నీరు సక్రమంగా రాకపోవడంతో, ఇటు పైప్‌లైన్ మరమ్మతులకు గురికావడంతో ఆత్కూర్‌లో తాగునీటి కష్టాలు తప్పడం లేదు. గ్రామంలో ఉన్న సింగిల్ ఫేజ్ మోటార్ల వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామని గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఒక వేళ కరెంట్‌పోతే ఆ నీరు కూడా పట్టుకోవడం కష్టమౌతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే మూడు నెలలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు దృష్టిసారించి తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పైప్‌లైన్ లీకేజీతో ఆత్కూర్‌లో అవస్థలు
రెండు రోజులుగా నిలిచిపోయిన నీటి సరఫరా
ఇబ్బందులు ఎదుర్కొంటున్న
గ్రామస్తులు
పట్టించుకోని అధికారులు
సమస్య పరిష్కరిస్తాం...
ఆత్కూర్‌లో నెలకొన్న తాగునీటి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. గ్రామ సమీపంలోని బ్రిడ్జి నుంచి మొయిన్‌రోడ్డు వరకు కొత్త పైప్‌లైన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి రూ.2 లక్షలు మంజూరు చేశారు. కాంట్రాక్టర్ ఎవరూ కూడా ముందుకు రావడంలేదు. ఊరు లోతట్టు ప్రాంతంలో ఉండటంతో మిషన్ భగిరథ నీటి సరఫరా ఇబ్బందికరంగా మారింది. కొత్త పైప్‌లైన్ వేస్తే గ్రామానికి శాశ్వితంగా తాగునీటి సమస్య పరిష్కరించొచ్చు.
– అర్చన, పంచాయతీ కార్యదర్శి, ఆత్కూర్
Comments
Please login to add a commentAdd a comment