
నిరుపయోగం.. రైతువేదికలు!
దౌల్తాబాద్: మండలంలోని రైతులకు పంటల సాగులో అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఉపయోగకరంగా ఉంటాయన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతువేదికలు నిర్మించింది. ఈ వేదికలకు సరైన నిర్వహణ లేక పలు క్లస్టర్ గ్రామాల్లో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఈ విషయంలో పట్టించుకునే వారు కరువయ్యారు. ఉన్నతాధికారులు స్పందించి రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన రైతు వేదికలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని మండలంలోని రైతులు కోరుతున్నారు.
ఒక్కో రైతువేదికకు రూ.22లక్షల వ్యయం
మండలంలోని దౌల్తాబాద్, నందారం, కుదురుమళ్ల, చల్లాపూర్, గోకఫసల్‌వాద్, దేవర్‌ఫసల్‌వాద్, బాలంపేట, బిచ్చాల క్లస్టర్ గ్రామాల్లో రూ.12లక్షలతో ఉపాధి హామీ పథకం కింద, రూ.10లక్షలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్కో రైతువేదిక నిర్మాణానికి రూ.22లక్షలు ఖర్చు చేశారు. బిచ్చాల, దౌల్తాబాద్, గోకఫసల్‌వాద్ గ్రామాల్లో ఊరికి దూరంగా నిర్మించడంతో వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా...
గ్రామాలకు దూరంగా ఉన్న రైతువేదికల వద్ద పలు అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. చీకటి పడిన వెంటనే మద్యం ప్రియులు రైతువేదికల వద్దకు వెళ్లి మద్యం తాగుతున్నారు. కంపౌండ్ వాల్ నిర్మించకపోవడంతో ఇలాంటి పరిస్థితి దాపురిస్తుందని రైతులు వాపోతున్నారు. బిచ్చాల క్లస్టర్ రైతువేదిక గ్రామానికి దూరంగా ఉండడంతో అక్కడ ప్రతి రోజు మద్యం ప్రియులు మద్యం సేవిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోంది. గోకఫసల్వాద్ గ్రామంలో కూడా రైతువేదిక నిర్వహణ లేక అధ్వానంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి రైతువేదికలకు అవసరమైన ఫర్నీచర్‌తో పాటు విద్యుత్ వసతి, మూత్రశాలలు, మంచినీటి సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు.
మండలంలో రూ.1.76 కోట్ల ఖర్చుతో నిర్మాణం
రైతులకు చేకూరని ప్రయోజనం
ఆందోళన కలిగిస్తున్న నిర్వహణ లోపం
పట్టించుకోని అధికారులు
రైతుల అవసరాలకే..
మండలంలో నిర్మించిన రైతువేదికలను రైతుల అవసరాలకే వినియోగిస్తున్నాం. క్లస్టర్ స్థాయి ఏఈఓలు రైతువేదికల వద్ద రైతులను సమీకరించి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రైతువేదికల వద్ద ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తాం.
– లావణ్య, ఏఓ, దౌల్తాబాద్
Comments
Please login to add a commentAdd a comment