
ఏఐవిద్య
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టేందుకు సర్కారు నిర్ణయం
అమలుకు విద్యాశాఖ కసరత్తు
ఇటీవల కృత్రిమ మేధస్సుపై డీఈఓలకు శిక్షణ
తరగతి గదిలో ఏర్పాట్లపై దృష్టి
పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న జిల్లా
విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు ఏఐ సహకారం అవసరమని గుర్తించిన విద్యాశాఖ కృతిమ మేధస్సుతో బోధనకు కసరత్తు చేస్తోంది. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న జిల్లాలోని ఆరు పాఠశాలల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
వికారాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను పరిచయం చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృతిమ మేధస్సు సహకారం సైతం తీసుకోవాలని నిర్ణయించి ఇందుకు తగిన కసరత్తు ప్రారంభించారు. తొలుత ప్రాథమిక పాఠశాలల్లో ఏఐని ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ మేరకు విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా శుక్రవారం డీఈఓ, కలెక్టర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించి తరగతి గదిలో పరిచయంపై దిశా నిర్దేశం చేశారు. ఆధార్ సాఫ్ట్‌వేర్ తయారీలో కీలక భూమి పోషించిన ఎక్ స్టెప్ ఫౌండేషన్ వారు శనివారం జూమ్ మీటింగ్‌లో డీఈఓలు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు బోధనలో కృతిమ మేధస్సుపై అవగాహన కల్పించారు.
సర్కార్ శ్రమ ఫలించేనా..?
గతంలో ప్రాథమిక విద్యలో ఎన్నో ప్రయోగాత్మక కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేయగా అవేవి ఆశించిన స్థాయిలో ఫలితాలనివ్వలేదు. పాఠశాల విద్యలో సామర్థ్యాల పెంపునకు అపెప్, డిపెప్, క్లిప్, క్లాప్, క్యూఐపీ, ఎల్‌ఈపీ, ట్రిపుల్ ఆర్ తదితర కార్యక్రమాలను విద్యాశాఖ అమలు చేసింది. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఏఐ ప్రధానమైన నేపథ్యంలో సర్కార్ బడుల్లో ఈ విధానం ప్రవేశపెట్టి విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది సత్ఫలితాలు ఇస్తుందా..? ఆచరణలో చతికిల పడుతుందా అనేది వేచి చూడాలి.
పైలెట్ ప్రాజెక్టులో జిల్లా
ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పరిచయం చేయాలని చూస్తున్న ప్రభుత్వం ముందుగా ఐదు జిల్లా(వికారాబాద్, మెదక్, నారాయణపేట్, ఖమ్మం, మేడ్చెల్)లను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ మేరకు వారం రోజుల క్రితం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎక్ స్టెప్ ఫౌండేషన్ నిర్వహించిన రెండు రోజుల అవగాహన సదస్సుకు హాజరయ్యారు. పాఠశాల విద్యలో కృత్రిమ మేధస్సు ప్రవేశంతో లాభ–నష్టాలు, తరగతి గదిలో చేయాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సదుపాయాలు తదితర అంశాలు చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి ఇద్దరు డీఈఓలు(నిజామాబాద్, వికారాబాద్) హాజరయ్యారు. ఎక్ స్టెప్ ఫౌండేషన్ వారు ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలోని పాఠశాల విద్యలో ఏఐని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
ల్యాబ్‌లు అందుబాటులో ఉన్న ఆరు పాఠశాలల ఎంపిక
ఏఐని ప్రవేశపెట్టడానికి తగిన వాతావరణం ఉన్న పాఠశాలలను ముందుగా ఎంపిక చేసి పరిచయం చేయాలని నిర్ణయించారు. ఇందుకు కంప్యూటర్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్న ఆరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు.
పైలెట్ ప్రాజెక్ట్ పాఠశాలలు
మండలం, ప్రాథమిక పాఠశాల
దోమ, బొంపల్లి
పరిగి, గడిసింగాపూర్
తాండూరు, సాయిపూర్
కొడంగల్, కొడంగల్
కోట్‌పల్లి, ఎన్నారం
వికారాబాద్, పులిమద్ది
అందరి సహకారం అవసరం
విద్యలో ఏఐ అమలుకు రాష్ట్ర విద్యాశాఖ, కలెక్టర్ ఎంతో ప్రాధన్యత ఇస్తున్నారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవతం చేసేందుకు కృషి చేస్తాం. విద్యార్థులు చదవడం, రాయడం నేర్పిస్తారు. రాసేప్పుడు వారి చెవులకు ఇయర్ ఫోన్లు అమరుస్తారు. ఇందుకు ముందుగానే కంప్యూటర్లలో పొందుపరిచిన సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేస్తారు. కృత్రిమ మేధస్సు సహకారంతో విద్యార్థులు చదవడం, రాయడం విధానంలో పొరపాట్లను ముందిపు చేసి విద్యార్థులకు వివరిస్తుంది. విద్యార్థుల సామర్థ్యాల మదింపు, మూల్యాంకణం చేసి మరుసటి రోజు లేక కొద్ది రోజుల తర్వాత ఉపాధ్యాయులు చెప్పే అంశాలను ఏఐ వెంటనే వారికి చెబుతుంది. దీంతో వారు మళ్లీ ఆ తప్పు చేయకుండా ముందుకు వెళ్లటానికి వీలవుతుంది.
– రేణుకా దేవి, డీఈఓ, వికారాబాద్
Comments
Please login to add a commentAdd a comment