
డబ్బులు కట్టాం.. ఇళ్లు అప్పగించండి
హుడాకాంప్లెక్స్: పేద, బడుగు బలహీన వర్గాల కోసం నిర్మించిన ఇళ్లను వెంటనే అసలైన లబ్ధిదారులకు అప్పగించాలంటూ సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. హస్తినాపురం నందనవనం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద 15 ఏళ్ల క్రితం 512 నివాసాలను అప్పటి ప్రభుత్వం నిర్మించింది. వాటిలో 427 ఇళ్లను స్థానిక నిరుపేదలు ఆక్రమించుకుని కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. తర్వాత ప్రభుత్వం ఆ గృహాలకు సంబంధించిన లబ్ధిరులను ఎంపిక చేసి కేటాయింపు పత్రాలు అందజేసింది. వారు ఇక్కడికి వచ్చి చూడగా ఆ నివాసాల్లో వేరే వాళ్లు ఉంటున్నారని, ఖాళీ చేయబోమని చెప్పారని లబ్ధిదారులు అధికారులకు తెలియజేశారు. ఇళ్లలో ఉంటున్న వారికి, అధికారులు ఎంపిక చేసిన లబ్ధిదారులకు మూడేళ్లుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. న్యాయం చేయాలంటూ ఇరువర్గాలు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. సమస్యను పరిశీలించిన ప్రభుత్వం ప్రస్తుతం ఆ నివాసాల్లో ఉంటున్న పేదలకు డ్రా పద్ధతిలో నగరంలోని ఇతర ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా 15 నవంబర్ 2022న ఆర్డీఓ వెంకటాచారి, హౌసింగ్ బోర్డు ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో డ్రా పద్ధతిలో 427 కుటుంబాలకు ఇతర ప్రాంతాల్లో నివాసాలు కేటాయించారు. అయినా ఈ వారు నందనవనంలోని ఇళ్లు ఖాళీ చేయకుండానే కొత్తగా కేటాయించిన ఇళ్లను సైతం ఆక్రమించి నివాసం ఉంటున్నారు. 2006లో ఇళ్ల కోసం ప్రభుత్వానికి రూ.80,250 చొప్పున చెల్లించిన వారు విసిగిపోయి ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన హామీలు నెరవ్చేలేదన్నారు. ఇప్పటికై నా అక్రమంగా నివాసముంటున్న వారిని ఖాళీ చేయించి డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
లబ్ధిదారుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment