
‘ఉపాధి’కి ఇబ్బంది
దౌల్తాబాద్: గ్రామాల్లో వలసలను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహమీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పనుల పర్యవేక్షణ ఇతరతర పనుల నిమిత్తం గ్రామానికి ఒక ఫీల్డ్‌అసిస్టెంట్ నియమించింది. మండల పరిధిలో మొత్తం 33 గ్రామ పంచాయతీలకుగాను కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఉపాధి హమీ పనుల పర్యవేక్షణ కూలీలకు సరైన పనిదినాలు కల్పించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఫీల్డ్‌అసిస్టెంట్లు లేక ఆ భారం గ్రామకార్యదర్శులపై పడడంతో వారు ఒత్తిడికి గురవుతున్నారు.
సీనియర్ మేట్లతో పనులు
గతంలో 20 పంచాయతీలుండేవి. తర్వాత కొత్తగా 15 పంచాయతీలు ఏర్పాడ్డాయి. ఇందులో రెండు పంచాయతీలు దుద్యాల మండలంలో కలిశాయి. ఇప్పుడు 33 పంచాయతీలున్నాయి. కొత్త గ్రామాలు ఏర్పాటై నాలుగేళ్లు పూర్తయినా నేటి వరకు ఎఫ్‌ఏలను నియమించలేదు. మేజర్ గ్రామపంచాయతీ అయిన మండల కేంద్రంలోనే ఎఫ్‌ఏ లేరు. దేవర్‌ఫసల్‌వాద్ ఎఫ్‌ఏ రాజీనామా చేశారు. గుండేపల్లి ఎఫ్‌ఏ మృతి చెందారు. దీంతో ఆయా గ్రామాల్లో సీనియర్ మేట్లతోనే పనులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నూతన జీపీలకు ఖాళీగా ఉన్న గ్రామాలకు ఎఫ్‌ఏలను నియమించి సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామాల కూలీలు కోరుతున్నారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత
33 గ్రామాలకు 11 మందే ఫీల్డ్ అసిస్టెంట్లు
ఉపాధి హామీ పనులపై కొరవడిన పర్యవేక్షణ
పనిభారంతో ఇబ్బంది పడుతున్న పంచాయతీ కార్యదర్శులు
నేటికీ నూతన గ్రామాలకు కేటాయించని ఎఫ్‌ఏలు
ఆదేశాలు వస్తే ఖాళీల భర్తీ
33 పంచాయతీలకు గాను 11మంది ఎఫ్‌ఏలు ఉన్నారు. 22 గ్రామాలకు వేర్వేరు కారణాలతో ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో సీనియర్ మేట్ల సహాయంతో పనులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఖాళీలు భర్తీ చేస్తాం.
– రజినికాంత్, ఏపీఓ, దౌల్తాబాద్
Comments
Please login to add a commentAdd a comment