
హత్య చేసిన నిందితుడికి రిమాండ్
షాబాద్: మద్యం దుకాణంలో దొంగతనం చేస్తూ, అడ్డొచ్చిన ఓ యువకుడిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి ఓ ఆగంతకుడు షాబాద్ మండల కేంద్రంలోని దుర్గా వైన్స్‌లో దూరి పర్మిట్ రూమ్‌లో పడుకున్న వ్యక్తిని హత్య చేసిన సంగతి విదితమే. శుక్రవారం రాజేంద్రగనర్ జోన్ డీసీపీ శ్రీనివాస్ విలేకర్ల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పుడుగుర్తి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి నరేందర్ జల్సాలకు అలవాటు పడి చోరీలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 12న అర్ధరాత్రి అతడు దుర్గా వైన్స్‌లో చోరీకి యత్నించాడు. వెనుక వైపు గోడకు సుత్తెతో రంధ్రం చేస్తుండగా.. శబ్దం విని అక్కడే పనిచేసే భిక్షపతి(35) పర్మిట్ రూమ్ నుంచి బయటకు వచ్చి గట్టిగా అరిచాడు. దీంతో నరేందర్ పారతో భిక్షపతి తలపై కొట్టాడు. విలవిలలాడుతూ అక్కడే అతడు మృతి చెందాడు. ఆ తర్వాత వైన్స్‌లో దూరి సుమారు రూ.40వేల నగదు, కొన్ని మద్యం బాటిళ్లను తీసుకొని పరారయ్యాడు.
సీసీ కెమెరా ఆధారంగా..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడి నరేందర్‌గా గుర్తించారు. అతడిని శుక్రవారం ఉదయం సీతారాంపూర్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి బ్యాంక్ అకౌంట్‌ను నిలుపుదల చేసి కొంత సొత్తును రికవరీ చేశారు. కాగా నరేందర్‌పై గతేడాది బహుదూర్‌పురా, అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నాలుగు చోరీల కేసులో నేరస్తుడిగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ నెల 3న నాగర్‌గూడ వైన్స్‌లో దొంగతనానికి పాల్పడ్డాడని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ హత్య కేసును 24 గంటల్లోగా ఛేదించినందుకు రాజేంద్రగనర్ జోన్, చేవెళ్ల ఏసీపీలు ప్రశాంత్, కిషన్, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ కె.శశాంక్‌రెడ్డి, షాబాద్ సీఐ కాంతారెడ్డి బృందాలను డీసీసీ అభినందించారు.
గతంలోనూ పలు కేసులో ఉన్నట్లు నిర్ధారణ
రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment