
న్యాయం చేయాలని ఎస్పీకి వినతి
పూడూరు: సాగు చేస్తున్న భూమిని వదిలేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చన్గోముల్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎస్‌ఐ పట్టించుకోవడం లేదని బాధిత మహిళ శోభ శనివారం జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండల పరిధిలోని పుడుగుర్తి గ్రామానికి చెందిన నాగులపల్లి శోభ గ్రామంలోని సర్వే నంబర్ 54లో 0–23 గుంటల భూమిని కొంత కాలంగా సాగు చేస్తున్నానని తెలిపింది. కొంత కాలంగా తమ కుటుంబంలో భూమి విషయంలో కోర్టులో కేసు నడుస్తుంది. ఇది ఇలా ఉండగా వారు ఆ భూమి విషయంలో రాజీ కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆ భూమికి ఎలాంటి సంబంధం లేని వడ్డె ఎల్లయ్య, శ్రీను, చంద్రయ్య, లక్ష్మయ్య, కాశీనాథ్‌లు తమ భూమిని లాక్కోవడానికి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దాడి చేసి తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనను రక్షించాలని, భూమి జోలికి రాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు. దీంతో ఎస్‌ఐ కూడా తననే బెధిరిస్తున్నారని ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీని కలిసిన వారిలో మాజీ ఎంపీపీ మల్లేశం, దేవనోనిగూడ వెంకటయ్య, బాధిత కుటుంబసభ్యులు ఉన్నారు.