తాండూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రయ్య డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిత్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ... కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం సరికాదన్నారు. కార్పొరేట్ యాజమన్యాలకు అనుకూలంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ లేబర్ కోడ్‌లతో దేశంలో ఉన్న 55 కోట్ల మంది కార్మికుల ఆగ్రహానికి కేంద్ర ప్రభుత్వం గురికావడం తథ్యమన్నారు. న్యూ ఢిల్లీలో మంగళవారం జరిగే ఉమ్మడి కార్మిక సంఘాల జాతీయ సదస్సును విజయవంతం చేయాలన్నారు. అనంతరం సీసీఐ ఫ్యాక్టరీ జీఎంను కలిసి సీసీఐ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాన్యం వేజ్ బోర్డు ప్రకారం కార్మికులకు వేతనాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా గౌరవ అధ్యక్షుడు బాలశంకర్, నాయకులు రవీందర్, వంశీకృష్ణ, రెడ్డి సురేష్, దస్తప్ప, లాహేర్ బాషా, మోహన్, వెంకటేష్, దశరథ్‌గౌడ్, దస్తప్ప తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుచంద్రయ్య