
ఎంసీహెచ్‌లో గర్భస్థ శిశువు మృతి
తాండూరు టౌన్: వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భస్థ శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ తాండూరు పట్టణ శివారులోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఎదుట బుధవారం పలువురు ఆందోళనకు దిగారు. మండలంలోని గౌతాపూర్ గ్రామానికి చెందిన లాలప్ప భార్య ఆశమ్మ పురిటినొప్పులతో మంగళవారం రాత్రి ఎంసీహెచ్‌లో చేరింది. పరీక్షించిన వైద్యులు మరో నెల రోజుల తర్వాత డెలివరీ కానున్నట్లు చెప్పి పంపేశారు. అయితే బుధవారం ఉదయం 6గంటలకు మరోసారి ఆశమ్మ పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు స్కానింగ్ తీసుకుని రావాలంటూ ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌కు పంపారు. స్కానింగ్ రిపోర్టును పరిశీలించిన వైద్యులు గర్భంలోనే శిశువు మృతి చెందిందని చెప్పారు. అనంతరం ఆపరేషన్ చేసి ఆడ మృత శిశువును బయటకు తీశారు. అయితే పురిటి నొప్పులతో ఆసుపత్రికి వస్తే, వైద్యం చేయకుండా డాక్టర్లు పూర్తిగా నిర్లక్ష్యం వహించారంటూ బాలింత ఆశమ్మ భర్త లాలప్ప, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎంసీహెచ్ ఆసుపత్రిలో స్కానింగ్ తీయకుండా, ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌కు పంపారని, దీంతో సమయం మించిపోయిందన్నారు. పేదల ప్రాణాలంటే వైద్యులకు లెక్క లేదని, ఇక్కడ తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఉన్నతాధికారులు విచారణ జరిపి సదరు వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే వైద్యంలో తమ నిర్లక్ష్యమేమీ లేదని, స్కానింగ్ ఉదయం 10గంటల తర్వాతే తీస్తారని, అందుకే బయటకు పంపానని గైనకాలజిస్ట్ డాక్టర్ శాలిని తెలిపారు. డెలివరీకి నెలరోజులు పైన ఉన్నప్పటికీ గర్భంలో శిశువు గుండె సరిగా కొట్టుకోకవడం వల్ల శిశువు మృతి చెంది ఉన్నట్లు ఆమె చెప్పారు.
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని
బాధితుల ఆందోళన