
బాధితులకు న్యాయం చేయాలి
అనంతగిరి: సైబర్ నేరాలపై ఫిర్యాదులు వస్తే వెంటనే కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ నారాయణరెడ్డి సిబ్బందికి సూచించారు. గురువారం వికారాబాద్‌లోని తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన కేసులు, వాటి పురోగతి, విచారణ స్థితి, న్యాయపరమైన అంశాలు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, న్యాయస్థానాల్లో సరైన సాక్ష్యాధారాలు సమర్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రతి కేసునూ ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. వీటితో పాటు సాంకేతిక ఆధారాలను సమకూర్చడం, ఫోరెన్సిక్ సహాయాన్ని వినియోగించడం, ప్రత్యక్ష సాఽక్షులను సమర్థవంతంగా న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టె విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనం కేసులను త్వరితగతిన ఛేదించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో దొంగతనాలు, నేరాల నియంత్రణకు సీసీ టీవీల ఏర్పాటు ఎంతో అవసరమని ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో పరిగి, వికారాబాద్, తాండూరు డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ నారాయణరెడ్డి

బాధితులకు న్యాయం చేయాలి