
మద్యం మత్తులో కారుతో ఢీ
ఇబ్రహీంపట్నం: అతివేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే మృతిచెందగా.. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కారుతో పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. యాదాద్రి జిల్లా నారాయణపూర్ మండలం చిల్లాపూర్ గ్రామానికి చెందిన కొప్పు శంకరయ్య కూతురు స్పందన (19) మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో బీ ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతోంది. సైదాబాద్ సింగరేణికాలనీలో నివాసముండే తన స్నేహితుడు సాయికుమార్‌తో కలిసి గురువారం సాయంత్రం బైక్‌పై అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ సమీపంలో ఔటర్ సర్వీస్ రోడ్డుపై ఘట్‌కేసర్ వైపునకు వెళ్తున్నారు. ఈ సమయంలో వెనక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరూ గాల్లో ఎగిరి కారు అద్దంపై పడ్డారు. కారు అదే స్పీడ్‌లో వెళ్లడంతో కింద పడిపోయారు. స్పందన అక్కడికక్కడే మృతిచెందగా, సాయికుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సాయికుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. స్పందన మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
దిల్‌సుఖ్‌నగర్‌లో అదుపులోకి..
ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తన స్కోడా కారుతో సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్ వైపు వెళ్తుండగా కారు అద్దాలు పగిలి ఉండడం, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతన్ని పట్టుకుని విచారించగా యాక్సిడెంట్ చేసినట్లు అంగీకరించడంతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగా నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరి ప్రాంతానికి చెందిన ప్రదీప్ అనే వ్యాపారవేత్తగా గుర్తించారు. ప్రస్తుతం అతను అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బైక్‌పై వెళ్తున్న యువతి మృతి, యువకుడికి తీవ్ర గాయాలు
అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో ఘటన
కారుతో పరారవుతుండగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు

మద్యం మత్తులో కారుతో ఢీ