
అంతర్రాష్ట్ర చీరల చోరీ ముఠా అరెస్టు
మియాపూర్: చీరలు కొనేందుకు షాపింగ్ మాల్స్‌కు వెళ్తూ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు ఏడుగురిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోకుండా మళ్లీ చీరల చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా నుంచి రూ.2 లక్షల విలువ చేసే చీరలు, ఇక ఇన్నోవా కారును స్వాధీనం చేసుకుని శనివారం రిమాండ్‌కు తరలించారు. మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్,డీఐ రమేష్ నాయుడు కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఏపీలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తిరుపూర్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు, చౌటూరు గ్రామానికి చెందిన కట్ట యశోద, సద్దుపాటి తిరుపతమ్మ, వెంకటేశ్వరమ్మ, చట్రాయిమండలం జనరాద్రవార గ్రామానికి చెందిన రమణ అలియాస్ రావణక్క, విజయవాడ పటమట ప్రాంతానికి చెందిన దేరవకొండ సుభాషిణి, జగ్గయ్యపేట్‌కు చెందిన వెంకటేశ్వర్లు ఓ ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాలలో చీరల దొంగతనాలకు పాల్పడుతుండేవారు. ఈ ముఠాలో సుమారు 50 నుంచి 100 మంది సభ్యులున్నట్లు తెలిపారు. వీరు గ్రూపులుగా ఏర్పడి 30 సంవత్సరాల నుంచి చీరల దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇన్నోవా కారులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ తిరుగుతూ తక్కువ ఉద్యోగులు ఉన్న షాపింగ్ మాల్స్, ఇళ్లల్లో చీరల వ్యాపారం నిర్వహించే వారిని టార్గెట్ చేసుకుంటారు. నిర్వాహకులు దృష్టి మరల్చి చీరలు దొంగిలిస్తారు. ప్రతి నెలా 5 నుంచి 8 దొంగతనాలకు పాల్పడతారు.
దొంగతనం తర్వాత మొక్కులు చెల్లిస్తారు..
దొంగిలించిన చీరలను తీసుకుని వీరు కారులో యాదగిరిగుట్ట, ఇతర దేవాలయాలకు వెళ్తుంటారు. అక్కడ దేవుడికి మొక్కులు చెల్లించుకుని అనంతరం విజయవాడకు వెళ్లి కనకదుర్గమ్మ దేవాలయం ముందు, బస్టాప్, సంతల్లో, రద్దీ ప్రదేశాల్లో ఒక్కో చీరను రూ.2 వేల నుండి 10వేల వరకు అమ్ముతుంటారు. అమ్మగా వచ్చిన డబ్బులను ముఠా సభ్యులు పంచుకుంటారు. కాగా చీరల దొంగతనం చేసే ముఠా సభ్యులపై పదుల సంఖ్యలో కేసులున్నాయి. అనేక సార్లు అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లివచ్చారు. అయినా వీరు దొంగతనాలు మానలేదని చెప్పారు.
మియాపూర్ పోలీసులకు ఇలా పట్టుబడ్డారు...
గత 28వ తేదీన మియాపూర్‌లోని ఫ్రెండ్స్ కాలనీలో ఈ ముఠా సభ్యులు వెంకటేశ్వరరావుతో పాటు మహిళలు చీరల షాపుకు వెళ్లారు. షాపు నిర్వహించే మహిళ బయటకు వెళ్లడంతో ఆమె భర్త వచ్చిన వారికి చీరలు చూపించాడు. చీరలు చూస్తూ యజమాని దృష్టి మరల్చేందుకు నీళ్లు కావాలని అడిగారు. దీంతో యజమాని ఇంట్లోకి వెళ్లి వాటర్ తీసుకువచ్చేలోపు మరికొంత మంది మహిళలు చీరలు దొంగిలించారు. కొద్దిసేపు చీరలు చూసి మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి షాపు నిర్వాహకురాలు ఇంటికి వచ్చి పరిశీలించగా 14 చీరలు కనిపించలేదు. దీంతో మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 3వ తేదీన ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు.
ఏడుగురి రిమాండ్..రూ.2 లక్షల విలువైన చీరలు, కారు స్వాధీనం