
ముగిసిన ఆంజనేయస్వామి జాతర
యాలాల: బాక్వారం ఆంజనేయస్వామి జాతర ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజు ఆలయంలో సత్యనారాయణస్వామి పూజ నిర్వహించారు. యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. జాతర సందర్భంగా హాజీపూర్, యాలాల, గోరేపల్లి, జక్కేపల్లి, దేవనూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. కాగా శనివారం రాత్రి భక్తుల జనసందోహం మధ్య రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ మాజీ సర్పంచ్ ఒంగోనిబాయి శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.
‘మా మసీదు’ సందర్శనలో నేతలు
తాండూరు టౌన్: ప్రజలంతా సమానత్వం, ఆధ్యాత్మిక విలువలతో మెలగాలనేదే ఇస్లాం మత సారాంశమని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన మా మసీదు సందర్శన కార్యక్రమానికి మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఆదివారం పట్టణంలోని ఖాన్‌కాలనీలో గల మహ్మదీయ అహ్లి హదీస్ మసీదును వారు సందర్శించారు. ఈ సందర్భంగా మత వక్తలు ఖురాన్ ప్రాముఖ్యత, మత విశ్వాసాలు, మానవ ధర్మం, నైతిక విలువలపై బోధన చేశారు. ఏ మతమైనా ఆధ్యాత్మిక భావాలతో, ప్రపంచ శాంతి కోరుకుంటుందన్నారు. వారి వెంట నాయకులు కరణం పురుషోత్తంరావు, అఫు, యూనస్, శ్రీధర్, అశోక్, ముక్తార్‌నాజ్ తదితరులు ఉన్నారు.
‘చలో వరంగల్’కు తరలివెళ్దాం
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
తాండూరుటౌన్: చలో వరంగల్ పేరిట ఈ నెల 27న నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్దామని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పార్టీ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా నేటికీ హామీలను అమలు చేయలేకపోతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్‌నే మళ్లీ సీఎంగా కోరుకుంటున్నారని చెప్పారు. అనంతం నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
ఉప్పల్ స్టేడియంలో దొంగల చేతివాటం
ఉప్పల్: ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం అభిమానులు ఆనందంలో మునిగి తేలగా సెల్‌ఫోన్ దొంగలు చేతి వాటం చూపించారు. స్టేడియం భద్రతలో దాదాపుగా 3 వేలకు పైగా పోలీసులు పహారా కాస్తున్నా వారిని లెక్క చేయకుండా సెల్‌ఫోన్ దొంగలు హాల్‌చల్ సృష్టించారు. వందలాది సెల్ ఫోన్‌లను దొంగిలించడంతో బాధితులు లబోదిబో మంటూ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ పరుగుల వరద సృష్టించిన ఆనందంలో ప్రేక్షకులుండగా..దొంగలు చేతి వాటం చూపించినట్లు తెలిసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇంతగా సెల్‌ఫోన్లు దొంగిలించిన సంఘటన బహుషా ఇదే మొదటి సారి కావచ్చంటున్నారు. ఈ విషయంలో ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిని వివరణ కోరగా దాదాపుగా 15 నుంచి 20 మంది మాత్రం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ముగిసిన ఆంజనేయస్వామి జాతర