
కల్లాల్లేక.. తడిసి మోపెడు
దౌల్తాబాద్: ఐకేపీ, కోఆపరేటివ్ సహకార సంఘాల ఆధ్వర్యంలో మండలంలో ఏటా ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కల్లాలు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. కేంద్రాలకు శాశ్వత స్థలాల్లేక అధికార యంత్రాంగం కల్లాల నిర్మాణాలపై శ్రద్ధ చూపడంలేదని రైతులు చెబుతున్నారు. కేంద్రాలు ఏర్పాటు చేసిన స్థలాల్లో తెచ్చి పోసిన ధాన్యం మట్టిలో కలిసి నష్టపోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. మండలంలో ఏళ్ల క్రితం నుంచి ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా వాటికి శాశ్వత స్థలాలు గుర్తించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతుంది. ఏటా వానాకాలం, యాసంగి సీజన్‌లో ఐకేపీ, కోఆపరేటివ్ ఆధ్వర్యంలో గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారు. రైతులు పండించిప ధాన్యం విక్రయానికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా కేంద్రాల ఏర్పాటుతో రైతులకు ప్రయోజనమున్నా వసతుల కల్పనలో అధికారులు విఫలమవుతున్నారు. ధాన్యం మట్టిలో కలుస్తుందని రైతులు పరదాలు కిరాయికి తెచ్చుకుంటున్నారు. పరదాల అద్దె తడిసి మోపడవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను కేటాయించి కల్లాలు నిర్మించాలని వేడుకుంటున్నారు.