దొండపర్తి : భారత్–ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 19న డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్‌కు 27 వేల మంది క్రికెట్ అభిమానులు రానున్నారు. వీరితో సాధారణ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సి.హెచ్.శ్రీకాంత్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు పలు సూచనలు చేశారు.
●మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు జరగనుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు 27 వేల మంది రానున్నారు. వేల సంఖ్యలో వచ్చే వాహనాలతో స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోతాయి. దీంతో సాధారణ వాహనదారులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలి.
●శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి విశాఖకు వచ్చే బస్సులు, ఇతర కమర్షియల్ వాహనాలు మారికవలస వద్ద ఎడమ వైపు తిరిగి జురాంగ్ జంక్షన్ మీదుగా తిమ్మాపురం చేరుకోవాలి. అక్కడి నుంచి కుడి వైపు తిరిగి బీచ్ రోడ్డులో ప్రయాణించి రుషికొండ, సాగర్‌నగర్, జోడుగుళ్లపాలెం మీదుగా వెళ్లాలి.
●శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు వంటివి కార్ షెడ్ వద్ద నుంచి మిథిలాపురి కాలనీలో ప్రవేశించాలి. అలా ఎంవీవీ సిటీ వెనుకగా వెళ్లి లా కాలేజీ రోడ్డు మీదుగా ఎన్‌హెచ్ 16 చేరుకుని నగరంలోకి వెళ్లాలి. లా కాలేజీ రోడ్డు నుంచి, పనోరమ హిల్స్ మీదుగా రుషికొండ వైపు వెళ్లి అక్కడి నుంచి నగరంలోకి వెళ్లవచ్చు.
●నగరం నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే బస్సులు, కమర్షియల్ వాహనాలు హనుమంతవాక నుంచి ఎడమ వైపు తిరిగి, ఆరిలోవ బీఆర్‌టీఎస్ రోడ్డులో వెళ్లి, అడివివరం వద్ద కుడి వైపు తిరిగి ఆనందపురం మీదుగా వెళ్లాలి.
●నగరం నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు వంటివి హనుమంతవాక జంక్షన్ నుంచి ఎడమ వైపు తిరగాలి. అడవివరం మీదుగా ఆనందపురం వెళ్లవచ్చు. అలాగే విశాఖ వాలీ, ఎండాడ జంక్షన్ నుంచి కుడి వైపు తిరిగి, బీచ్‌రోడ్డుకు చేరుకుని తిమ్మాపురం వద్ద ఎడమ వైపు తిరిగి మారికవలస వద్ద ఎన్‌హెచ్ 16కు చేరుకోవాలి.
భారీ వాహనాలకు సూచనలు
●19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఎటువంటి భారీ వాహనాలు మధురవాడ స్టేడియం వైపు అనుమతించరు.
●అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలు, నగరంలోకి రాకుండా సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి.
●శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండా, ఆనందపురం నుంచి పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి వైపు వెళ్లాలి.
●అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే భారీ వాహనాలన్నీ అనకాపల్లి వైపు నుంచి సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా ప్రయాణించాలి.
●శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి విశాఖకు వచ్చే భారీ వాహనాలన్నీ ఆనందపురం నుంచి పెందుర్తి, సబ్బవరం, అనకాపల్లి మీదుగా నగరానికి చేరుకోవాలి.
మ్యాచ్‌కు వచ్చే వాహనచోదకులకు సూచనలు
●నగరం వైపు నుంచి స్టేడియానికి వచ్చే వీవీఐపీ, వీఐపీ వాహనచోదకులు ఎన్‌హెచ్ 16లో స్టేడియం వరకు ప్రయాణించి, ఏ, బీ గ్రౌండ్లు, వీ కన్వెన్షన్‌కు పాసుల ప్రకారం చేరుకోవాలి.
●విశాఖ నుంచి స్టేడియానికి వచ్చే టికెట్ ఉన్న వారు ఎన్‌హెచ్ 16లో ప్రయాణించి స్టేడియం వద్ద గల ఓల్డేజ్ జంక్షన్ వద్ద ఎడమ వైపు తిరిగి సాంకేతిక ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో పార్కింగ్ చేసుకోవాలి. సాంకేతిక ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఆన్‌లైన్ టికెట్లను ఒరిజినల్ టికెట్లుగా మార్చుకునేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు.
●శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం, గంభీరం, బోయపాలెం, కొమ్మాది వైపు నుంచి వచ్చే వారు కార్ షెడ్ జంక్షన్ వద్ద కుడి వైపు తిరిగి సాంకేతిక ఇంజినీరింగ్ కాలేజీ పార్కింగ్ గ్రౌండ్‌కు చేరుకోవాలి. లేదా కారుషెడ్ జంక్షన్ నుంచి ఎడమ వైపు తిరిగి మిథిలాపురి కాలనీ మీదుగా వచ్చి.. ఎంవీవీ సిటీ డబుల్ రోడ్డు, పోలిశెట్టి వేణుగోపాలరావు గ్రౌండ్‌లో పార్కింగ్ చేసుకోవాలి.
●నగరం నుంచి లేదా భీమిలి వైపు నుంచి బీచ్ రోడ్డు మీదుగా స్టేడియానికి వచ్చే వారు ఐటీ సెజ్ మీదుగా ఎంవీవీ సిటీ డబుల్ రోడ్డుకు చేరుకుని అక్కడ పార్కింగ్ చేసుకోవాలి.
●నగరం నుంచి వచ్చే ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఎన్‌హెచ్ 16లో రాకుండా, బీచ్‌రోడ్డులో వచ్చి ఐటీ సెజ్ మీదుగా లా కాలేజీ రోడ్డులో పార్కింగ్ చేయాలి.
●శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి వచ్చే ఆర్టీసీ స్పెషల్ బస్సులు, మారికవలస, తిమ్మాపురం, ఐటీ సెజ్ మీదుగా వచ్చి లా కాలేజీ రోడ్డుకు చేరుకుని పార్కింగ్ చేయాలి.
●పూర్తి భద్రతతో ఎటువంటి అపశ్రుతులూ జరగకుండా స్టేడియం చుట్టూ బారికేడ్లు ఏర్పాటుచేశారు.
●ప్రేక్షకులు నిర్దేశించిన గేట్ల ద్వారా మాత్రమే స్టేడియంలోకి ప్రవేశించాలి.
Comments
Please login to add a commentAdd a comment