విశాఖపట్నం: భారత్–ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య ఈ నెల 23న వైఎస్సార్ స్టేడియంలో జరిగే టీ–20 మ్యాచ్‌కు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ ఆదేశాల మేరకు రెండు వేల మందితో పటిష్ట భద్రత చర్యలు చేపడుతున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి క్రీడాకారులు బయలుదేరే ప్రాంతాల్లోనే కాకుండా.. వారు బస చేసే హోటళ్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్టేడియం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి వెళ్లే అన్ని గేట్ల వద్ద ఏసీపీ స్థాయి అధికారులను నియమించారు. స్టేడియం వద్ద మూడంచెల భద్రతతో పలు సెక్టార్లుగా విభజించారు. స్టేడియం లోపల, బయట, చుట్టూ ఉన్న బహుళ అంతస్తులపైనా పూర్తి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్ సందర్భంగా ఎక్కడా ట్రాఫిక్ నిలిచిపోకుండా ప్రణాళికలు సిద్ధం చేశారు.
పోలీసుల సూచనలివీ..
► అనేక ప్రత్యేకతలతో టికెట్ డిజైన్ చేశారు. లెవల్–1లో టికెట్‌ను హాఫ్ ఇంచ్ చింపితే ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది. టికెట్‌ను సమాంతరంగా పెట్టి చూస్తే గోల్డ్ కలర్ సెక్యూరిటీ థ్రెడ్ కనిపిస్తుంది. టికెట్‌పై బార్‌కోడ్ స్కాన్ చేస్తే మ్యూజిక్ వస్తుంది. అలా ఉంటేనే ఒరిజినల్ టికెట్‌గా పరిగణిస్తారు.
► కొంతమంది కలర్ జిరాక్స్ తీసిన టికెట్లను అమ్మి మోసగిస్తారు. అటువంటి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కలర్ జిరాక్స్ టికెట్లను కొని మోసపోవద్దు.
► బయట నుంచి ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లను అనుమతించరు. స్టేడియంలోనే ఇవి అందుబాటులో ఉంటాయి.
► స్టేడియం మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. ప్రేక్షకులు ఎవరైనా ఎటువంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినా.. పరిధి దాటి ఆటగాళ్లతో సెల్ఫీలు తీసుకున్నా.. ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవు.
► సాయంత్రం 7 నుంచి రాత్రి 11 వరకు క్రికెట్ మ్యాచ్ ఉంటుంది. ప్రేక్షకులను సాయంత్రం 4 లేదా 5 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతిస్తారు.
ట్రాఫిక్, పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు
టీ–20 మ్యాచ్ సందర్భంగా స్టేడియానికి 28 వేల మంది వచ్చే అవకాశముంది. వేల సంఖ్యలో వాహనాలపై వారు వచ్చే అవకాశం ఉండటంతో.. అందుకు తగ్గట్టుగా పోలీసులు ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
► మ్యాచ్‌తో సంబంధం లేని వాహనచోదకులు క్రికెట్ స్టేడియం వైపు నుంచి కాకుండా.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలి.
► శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి నగరంలోకి వచ్చే బస్సులు, ఇతర కమర్షియల్ వాహనాలు మారికవలస వద్ద ఎడమ వైపునకు తిరిగి.. జురాంగ్ జంక్షన్ మీదుగా తిమ్మాపురం చేరుకోవాలి. కుడి వైపున బీచ్ రోడ్డులో ప్రయాణించి రుషికొండ, సాగర్ నగర్, జోడుగుళ్లపాలెం మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.
► శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు వంటివి కార్ షెడ్ నుంచి మిథిలాపురి కాలనీ మీదుగా.. ఎంవీవీ సిటీ వెనుకగా వెళ్లాలి. అక్కడి నుంచి లా కాలేజీ రోడ్డు మీదుగా ఎన్‌హెచ్ 16కు చేరుకుని నగరానికి చేరుకోవాలి. లా కాలేజీ రోడ్డు నుంచి పనోరమ హిల్స్, రుషికొండ మీదుగా కూడా నగరంలోకి వెళ్లవచ్చు.
► నగరం నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే బస్సులు, ఇతర కమర్షియల్ వాహనాలు, హనుమంతవాక నుంచి ఎడమ వైపు తిరిగి.. ఆరిలోవ బీఆర్‌టీఎస్ రోడ్డులో వెళ్లి అడివివరం వద్ద కుడి వైపు తిరిగి ఆనందపురం మీదుగా వెళ్లాలి.
► నగరం నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు హనుమంతవాక జంక్షన్ నుంచి ఎడమ వైపు తిరిగి.. అడివివరం మీదుగా ఆనందపురం వెళ్లొచ్చు. లేదా హనుమంతవాక జంక్షన్ లేదా విశాఖ వ్యాలీ జంక్షన్ లేదా ఎండాడ జంక్షన్ వద్ద కుడి వైపు తిరిగి బీచ్ రోడ్డుకు చేరుకుని.. తిమ్మాపురం వద్ద ఎడమ వైపు తిరిగి మారికవలస వద్ద ఎన్‌హెచ్ 16కు చేరుకోవచ్చు.
భారీ వాహనదారులకు సూచనలు
►23వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు ఎటువంటి భారీ వాహనాలు స్టేడియం వైపు అనుమతించరు.
► అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండా సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి.
►శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండా ఆనందపురం నుంచి పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి వైపు వెళ్లాలి.
► నగరం నుంచి బయలుదేరి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే భారీ వాహనాలు అన్నీ అనకాపల్లి వైపుగా సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా ప్రయాణించాలి.
► శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి నగరంలోకి వచ్చే భారీ వాహనాలన్నీ ఆనందపురం నుంచి పెందుర్తి, సబ్బవరం, అనకాపల్లి మీదుగా నగరంలోకి చేరుకోవాలి.
మ్యాచ్ వీక్షించడానికి వచ్చే వాహనచోదకులకు సూచనలు
నగరం నుంచి స్టేడియానికి వచ్చే వీవీఐపీ, వీఐపీ వాహనచోదకులు ఎన్‌హెచ్16లో స్టేడి యం వరకు ప్రయాణించి.. ఏ గ్రౌండ్, బీ గ్రౌండ్, వి కన్వెన్షన్ గ్రౌండ్‌లలో వారి వారి పాస్‌ల ప్రకారం చేరుకోవాలి.
విశాఖ వైపు నుంచి స్టేడియానికి వచ్చే టికెట్ ఉన్న వారు ఎన్‌హెచ్16లో ప్రయాణించి.. స్టేడియం సమీపంలోని ఓల్డేజ్ జంక్షన్ వద్ద ఎడమ వైపు తిరిగి సాంకేతిక ఇంజినీరింగ్ కాలే జీ గ్రౌండ్‌లో పార్కింగ్ చేసుకోవాలి. అక్కడే ఆన్‌లైన్ టికెట్లను ఒరిజినల్ టికెట్లుగా మార్చుకునేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం, గంభీరం, బోయపాలెం, కొమ్మాది వైపు నుంచి వచ్చే వారు కార్‌షెడ్ జంక్షన్ వద్ద కుడి వైపు తిరిగి సాంకేతిక ఇంజినీరింగ్ కాలేజీ పార్కింగ్ గ్రౌండ్‌కు చేరుకోవాలి. లేదా కార్ షెడ్ జంక్షన్ నుంచి ఎడమ వైపు తిరిగి మిథిలాపురి కాలనీ మీదుగా వచ్చి, ఎంవీవీ సిటీ డబుల్ రోడ్డు, పోలిశెట్టి వేణుగోపాలరావు గ్రౌండ్‌లలో పార్కింగ్ చేసుకోవాలి.
నగరం నుంచి లేదా భీమిలి వైపు నుంచి బీచ్ రోడ్డు మీదుగా స్టేడియానికి వచ్చే వారు.. ఐటీ సెజ్ మీదుగా మీదుగా వచ్చి ఎంవీవీ సిటీ డబుల్ రోడ్డులో వాహనాలు నిలపాలి.
నగరం నుంచి వచ్చే ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఎన్‌హెచ్–16లో రాకుండా బీచ్‌రోడ్డులో వచ్చి ఐటీ సెజ్ మీదుగా లా కాలేజీ రోడ్డులో పార్కింగ్ చేసుకోవాలి.
శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి వచ్చే ఆర్టీసీ స్పెషల్ బస్సులు మారికవలస, తిమ్మాపురం, ఐటీ సెజ్ మీదుగా లా కాలేజీ రోడ్డుకు చేరుకుని వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment