విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ–20 సదస్సుకు 2,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు కల్పిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. బందోబస్తులో 1,850 సివిల్ పోలీసులు, 400 మంది ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు, 4 గ్రే హౌండ్స్ యూనిట్లు, 2 క్యూఆర్‌టీ టీమ్‌లు, 6 స్పెషల్ పార్టీలు, 2 ఏపీఎస్పీ ప్లాటూన్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఆదివారం విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు.
సదస్సు వేదిక వద్ద సిబ్బంది ధరించాల్సిన యూనిఫాం, అధికారులు, సిబ్బంది పాటించాల్సిన నియమాలు, ట్రాఫిక్, ఇతర విధుల నిర్వహణలో ఇప్పటికే పలు సూచనలు చేశామన్నారు. అంతర్జాతీయస్థాయిలో విధులు నిర్వహించే విధానాలపై ఇప్పటికే అనుభవజ్ఞులైన వారితో ప్రత్యేక తరగతులు ద్వారా అధికారులకు తెలియజేశామన్నారు. సిబ్బంది, అధికారులు తమ విధులను పూర్తి నిబద్ధతతో నిర్వర్తించాలని ఆదేశించారు. అతిథులు నగరంలో పర్యటించే ప్రాంతాల్లో పర్యాటకులకు ప్రవేశం లేదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.
ప్రజలు, సదస్సుకు హాజరయ్యే వారికి ట్రాఫిక్‌లో అసౌకర్యం, అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 28, 29, 30 తేదీల్లో రాడిసన్ బ్లూ హోటల్ పరిసర ప్రాంతాలు, బీచ్‌రోడ్డు, ఇతర జంక్షన్లు రద్దీగా ఉండే అవకాశం ఉన్నందున నగరవాసులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎయిర్‌పోర్టు, తాటిచెట్లపాలెం, వేమన మందిరం, సిరిపురం, సీఆర్ రెడ్డి జంక్షన్, పార్క్ హోటల్, కురుపాం జంక్షన్, రాడిసన్ బ్లూ హోటల్ వరకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి.. ట్రాఫిక్ పోలీసులు నిర్దేశించిన ప్రాంతాల్లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సిటీకి చేరుకున్న పోలీసులు
జీ–20 సదస్సు బందోబస్తుకు శ్రీకాకుళం, పార్వతీపురం ప్రాంతాల నుంచి పోలీసులు ఆదివారం పోలీస్ బ్యారెక్స్‌కు బస్సుల్లో తరలివచ్చారు. అక్కడ నుంచి వారికి కేటాయించిన స్థలాల్లో విధులు నిర్వహించేందుకు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment