విశాఖపట్నం: ఐదేళ్ల బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. ఇంటిలో నుంచి ఆడుకునేందుకు వెళ్లిన కొడుకు నిర్జీవంగా కనిపించడంతో అతని తల్లిదండ్రులు విలపించిన తీరు అందరినీ కలచివేసింది. బాలుడిని ఎవరైనా హత్య చేశారా? లేదా పాము కాటుకు గురయ్యాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురంలో పల్లా కనకరాజు, నారాయణమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి కూతురు, కొడుకు తేజ(5) ఉన్నారు. కనకరాజు లారీ డ్రైవర్‌గా పని చేస్తుండగా నారాయణమ్మ గృహిణి. తేజ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆడుకుంటుంటాడు. చుట్టు పక్కల వాళ్ల ఇంటికి కూడా వెళ్తుంటాడు. ఈ తరుణంలోనే గురువారం సాయంత్రం ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆడుకునేందుకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. తేజ ఎక్కువగా ఎక్కడెక్కడికి వెళ్తుంటాడో ఆ ప్రదేశాల్లో వెతికినప్పటికీ.. చిన్నారి జాడ కనిపించలేదు. దీంతో రాత్రి 10 గంటల సమయంలో పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే ఎస్‌ఆర్‌పురం వచ్చిన లా అండ్ ఆర్డర్ ఎస్‌ఐ అసిరితాత గ్రామస్తులతో కలిసి బాలుడి జాడ కోసం వెతికారు. కానీ ఫలితం లేకపోయింది. కాగా.. శుక్రవారం ఉదయం ఇంటికి సమీపంలోనే లారీ షెడ్ పక్కన తేజ విగతజీవిగా ఉండటాన్ని గ్రామస్తులు, తల్లిదండ్రులు చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న నార్త్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, ఇన్‌చార్జి సీఐ నరసింహారావు అక్కడ పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. తేజ మృతిపై అనుమానాలు తలెత్తడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాపు ప్రారంభించారు. ఇదిలా ఉండగా తన కుమారుడిని ఎవరో చంపేశారని తేజ తల్లి నారాయణమ్మ ఆరోపించారు.
జరిగిన ఘటనపై ఏసీపీ నరసింహ మూర్తి మాట్లాడుతూ తేజ నోటి వెంట నురగ వచ్చి ఉందని, చేతికి రెండు గాట్లు ఉన్నాయని, పాము కరిచి ఉండవచ్చనే అనుమానం ఉందన్నారు. లేదా తేజ కుటుంబంతో పడనివారెవరైనా గత కారణాలను దృష్టిలో ఉంచుకుని హత్య చేసి ఉంటారా అన్న అనుమానం కూడా కలగుతోందన్నారు. పోస్టుమార్టం నివేదిక రాగానే అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా శుక్రవారం ఉదయం తేజ మృతదేహం కనిపించిన లారీ షెడ్ వద్ద.. గురువారం రాత్రి కూడా పోలీసులు, గ్రామస్తులు వెతికినట్లు చెబుతున్నారు. అప్పుడు కనిపించని తేజ మృతదేహం.. ఉదయానికి కనిపించడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment