విశాఖపట్నం: మీరు ఎప్పుడైనా.. ఎక్కడైనా తెల్ల పులులను చూశారా? మామూలు పులిని చూడడమే గగనమనుకుంటే.. మళ్లీ తెల్ల పులి అంటారా? అవును చూడటానికి ప్రత్యేకంగా ఉండే తెల్ల పులులు మన ఇందిరాగాంధీ జూ పార్కులో సందడి చేస్తున్నాయి. వీటి గాండ్రింపులతో సందర్శకులను అలరించడంతోపాటు జంతుమార్పిడిలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. దేశంలో వివిధ జూ పార్కులు, విదేశాల్లోని జూ పార్కుల నుంచి కొత్త జంతువులు ఇక్కడకు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
ఇందిరాగాంధీ జూ పార్కు 1971లో నిర్మించారు. అప్పటి నుంచి సుమారు మూడు దశాబ్దాల వరకు ఇక్కడ తెల్ల పులుల జాడేలేదు. 2000లో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కు నుంచి కుమారి, శిరీష్ అనే జత తెల్ల పులులను జూ అధికారులు ఇక్కడకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి సందర్శకులను అలరిస్తూనే.. వాటి సంతతిని పెంచుకున్నాయి. కుమారి ఐదుమార్లు గర్భం దాల్చి 11 పిల్లలకు జన్మనిచ్చింది. రెండు వారాల కిందట కుమారి మృతి చెందగా, శిరీష్ గతేడాది మరణించింది. ప్రస్తుతం వాటి పిల్లలు జూలో ఉన్నాయి.
నాలుగు తెల్ల పులులు మృతి
జూ పార్కులో కుమారి, శిరీష్‌తో పాటు మూడో విడతలో పుట్టిన రెండు పిల్లలు మృతి చెందాయి. గతేడాది శిరీష్, రెండు వారాల కిందట కుమారి వృద్ధాప్యంతో మరణించాయి. కుమారికి పుట్టిన నాలుగు తెల్లపులులను ఇతర జూ పార్కులకు పంపించగా.. ప్రస్తుతం ఐదు తెల్ల పులులు సందర్శకులను అలరిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment